సభాగౌరవం గంగపాలు!

చట్టసభల విశ్వసనీయత తెగ్గోసుకుపోతే ప్రజాస్వామ్యంపై జనావళి నమ్మకం నీరుగారుతుంది. సర్కారీ విధానాలను సునిశితంగా సమీక్షించే కర్తవ్య నిర్వహణలో పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు విఫలమైతే-

Published : 07 Jul 2022 00:29 IST

చట్టసభల విశ్వసనీయత తెగ్గోసుకుపోతే ప్రజాస్వామ్యంపై జనావళి నమ్మకం నీరుగారుతుంది. సర్కారీ విధానాలను సునిశితంగా సమీక్షించే కర్తవ్య నిర్వహణలో పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు విఫలమైతే- కార్యనిర్వాహక వ్యవస్థ మాటే శాసనమై, రాజ్యాంగ చట్రం ధ్వంసమవుతుంది. ఆ దుస్థితి తలెత్తకూడదంటే- ప్రజాహిత అంశాలపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సభావేదికగా ప్రభుత్వాలు సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వాలి. నిరర్థక నిరసనలతో పొద్దుపుచ్చకుండా అర్థవంతమైన సంవాదాలతో విపక్షాలూ సభాగౌరవాన్ని నిలబెట్టాలి. ఆ రాజకీయ విజ్ఞత లోపిస్తున్న భారతావనిలో- ఉన్నత విలువల్లోంచి నిర్మితమైన పార్లమెంటరీ సంప్రదాయాలు సడలిపోతున్నాయి. ప్రతిపాదిత శాసనాలను కూలంకషంగా పరిశీలించే సదవకాశాన్ని సభ్యులకు కల్పించే స్థాయీసంఘాలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో- రాజ్యసభ సచివాలయం పనితీరును మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభాధ్యక్షులు వెంకయ్య నాయుడు ఇటీవల ఒక కమిటీని కొలువుతీర్చారు. పార్లమెంటరీ స్థాయీసంఘాల కాలపరిమితిని పొడిగించాలని, వాటి నివేదికలపై సభలో నిర్మాణాత్మక చర్చలు సాగేలా చూడాలని ఆ సంఘం సభ్యులు తాజాగా సిఫార్సు చేశారు. 14, 15వ లోక్‌సభలతో పోలిస్తే పదహారో సభాకాలంలో (2014-19) అతి తక్కువ బిల్లులే స్థాయీసంఘాలకు వెళ్ళాయి. కేంద్ర సర్కారును ఇరకాటంలో పడేసే పరిశీలనలు కలిగిన సంఘాల నివేదికలను నిలువరించడానికి అధికారపక్షం యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లుగా లోగడే విమర్శలు వెల్లువెత్తాయి. బిల్లులను స్థాయీసంఘాలకు పంపాలా వద్దా అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న లోక్‌సభాపతి ఓమ్‌ బిర్లా- సభలో చర్చ చేపట్టడానికి కొద్ది క్షణాల ముందే బిల్లులను సభ్యులకు బట్వాడా చేస్తున్న పోకడలపై ఇటీవల ఆందోళన వ్యక్తపరచారు. ప్రతిపాదిత శాసనాల్లోని అంశాలేమిటో తమకే తెలియకపోతే- వాటి లోటుపాట్లను సభ్యులు ఎలా పరిశీలించగలుగుతారు? వారికి ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్న అధికారపక్షాలు- లోతైన చర్చలకు ఆస్కారం లేకుండా బిల్లులకు నిమిషాల వ్యవధిలో మొహరు వేయించుకుంటున్నాయి. చట్టసభల పరువుప్రతిష్ఠలను పాతాళానికి దిగలాగుతూ, వాటిని అలంకారప్రాయంగా మార్చేస్తున్నాయి!

అమెరికా దిగువసభ నిరుడు 166 రోజుల పాటు సమావేశమైతే- ఎగువసభ భేటీలు 192 రోజులు సాగాయి. యూకే, జపాన్‌లలో సంవత్సరానికి సగటున నూటయాభై దినాల పాటు చట్టసభల సమావేశాలు నిర్వహిస్తుంటే- కెనడా, జర్మనీల్లోనూ అవి వంద రోజులకు పైగానే జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న ఇండియాలో మాత్రం ఏడాదికి సగటున 63 దినాల పాటే లోక్‌సభ కొలువుతీరుతోంది. ప్రజా సమస్యలను సర్కారు దృష్టికి తెచ్చేందుకు సభ్యులకు సమధిక అవకాశాలు దక్కాలంటే- చట్టసభలు సమావేశమయ్యే రోజుల సంఖ్య కచ్చితంగా పెరగాల్సిందే. కానీ, అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం మూడేళ్ల క్రితమే చెప్పేసింది! రాష్ట్రాల శాసనసభల పరిస్థితి అయితే మరీ తీసికట్టుగా ఉంది. గడచిన దశాబ్దంలో అత్యధిక అసెంబ్లీలు సంవత్సరానికి సగటున ముప్ఫై రోజులైనా సమావేశం కాలేదు. అన్నింటి కంటే అధమంగా- పంజాబ్‌, హరియాణా సభలు ఏడాదిలో పక్షం పాటే పనిచేశాయి. 2014-21 మధ్య ఏపీ, తెలంగాణ అసెంబ్లీల వార్షిక సరాసరి పనిదినాలు 21.5, 22.3 మాత్రమేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చట్టసభలు భేటీ అవుతోందే అతికొద్ది కాలమైతే- అందులో అధిక భాగం నిరవధిక ఆందోళనలు, వాయిదాలతో  హరించుకుపోతోంది. చట్ట నిర్మాణంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పూజ్యంచేస్తూ ఆర్డినెన్సులతో పాలించే పెడధోరణి సైతం దేశంలో వేళ్లూనుకుంది. శాసన పూర్వ సంప్రతింపులు, ఆరోగ్యకరమైన చర్చలే జనహిత చట్టాలకు పురుడుపోస్తాయి. సంఖ్యాబలంతో సంప్రదాయాలు, నిబంధనలకు సమాధి కట్టకుండా అధికారపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తేనే- దేశానికి ప్రాణప్రదమైన వ్యవస్థలు పచ్చగా పరిఢవిల్లుతాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.