సైబర్‌ భద్రతే లక్ష్యంగా...

కంటికి కానరాని సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మాటున అంతర్జాలమే కార్యక్షేత్రంగా సహస్ర బాహువులతో చెలరేగిపోతున్నారు. దేశదేశాలను ఠారెత్తిస్తున్నారు. నిరుడు మే నెలలో సైబర్‌ దాడుల పాలబడి ఐర్లాండ్‌ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది.

Published : 02 Dec 2022 00:46 IST

కంటికి కానరాని సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మాటున అంతర్జాలమే కార్యక్షేత్రంగా సహస్ర బాహువులతో చెలరేగిపోతున్నారు. దేశదేశాలను ఠారెత్తిస్తున్నారు. నిరుడు మే నెలలో సైబర్‌ దాడుల పాలబడి ఐర్లాండ్‌ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. గత సంవత్సరం అక్టోబరులో సైబరాసురుల విజృంభణతో ఇరాన్‌ అంతటా గ్యాస్‌స్టేషన్లు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. అదే ఇరాన్‌లోని అణుఇంధన సంస్థపై గురిపెట్టిన హ్యాకర్లు అయిదు వారాల క్రితం అంతర్గత మెయిళ్లతోపాటు ఎన్నో కీలక ఒప్పంద పత్రాల్నీ బహిర్గతం చేయడం గగ్గోలు పుట్టించింది. వారంక్రితమే యూరోపియన్‌ పార్లమెంటు వెబ్‌సైట్‌ సైబర్‌ దాడికి గురైంది. ర్యాన్సమ్‌వేర్లతో పేట్రేగిపోతూ వివిధ సంస్థల కీలక సమాచారాన్ని చేజిక్కించుకుంటున్న కేటుగాళ్లు వందలకోట్ల రూపాయలు దండుకుంటున్న ఉదంతాలనేకం వెలుగుచూస్తున్నాయి. గత సంవత్సరం భారతీయ సంస్థల్లో 76 శాతందాకా అటువంటి ర్యాన్సమ్‌వేర్ల పాలబడి కోట్లరూపాయల ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చిందని క్రౌడ్‌స్ట్రయిక్‌ సర్వే వెల్లడించింది. తాజాగా దిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ‘ఎయిమ్స్‌’ సైతం బాధితుల జాబితాలో చేరింది. నాలుగు కోట్లమంది వరకు రోగుల సమాచారం కలిగిన అయిదు సర్వర్లను చెరపట్టిన హ్యాకర్లు రూ.200కోట్ల దాకా డిమాండు చేశారంటున్నారు. వారం రోజులపాటు ఆన్‌లైన్‌ సేవలన్నీ నిలిచిపోయిన దరిమిలా, పరిస్థితి తేటపడిందంటున్నా- ఎయిమ్స్‌ను సందర్శించే రాజకీయ ప్రముఖులు, అధికార శ్రేణులకు చెందిన వ్యక్తిగత సమాచార భద్రతపై అనేక భయానుమానాలు ముసురుకుంటున్నాయి. ఒక్క ఎయిమ్స్‌ అనేముంది- దేశవ్యాప్తంగా కోట్లాది రోగుల జీవనభద్రతతో ముడివడిన ఆస్పత్రుల కంప్యూటర్‌ నెట్‌వర్కులు సైబర్‌ నేరగాళ్లకు బంగారు బాతులుగా మారకుండా ప్రభుత్వం ఏం చేయదలచింది? ఆరోగ్యసేవా సంస్థలపై ప్రతినెలా సగటున 2.78లక్షల సైబర్‌ దాడులు నమోదవుతున్న దేశం మనది. బ్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, విద్యుత్‌ సదుపాయాలు, టెలికమ్యూనికేషన్‌ విభాగాలు తదితరాలకూ పెనుముప్పు పొంచిఉన్న దృష్ట్యా- కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కలిసికట్టుగా సైబరాసురులపై సత్వరం ఉక్కుపాదం మోపాలి!

అంతర్జాల నేర ముఠాల అరాచకాలను అరికట్టి పౌరులకు, వ్యాపార వర్గాలకు, ప్రభుత్వానికి సురక్షితమైన ‘సైబర్‌ స్పేస్‌’ నిర్మాణమే ధ్యేయమంటూ 2013లో అప్పటి యూపీఏ సర్కారు నూతన భద్రతా విధానం ప్రకటించింది. 2018 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అయిదు లక్షల మంది నిపుణులతో కూడిన సమర్థ యంత్రాంగం అవతరణను నాటి విధానపత్రం లక్షించింది. నాస్కామ్‌ (సాఫ్ట్‌వేర్‌ సేవా సంస్థల జాతీయ సంఘం) పది లక్షల మంది సైబర్‌ సైనిక దళం అత్యావశ్యకమని మదింపు వేసినా- ఇప్పటికీ ఆ సంఖ్య మూడు లక్షలకు లోపే! మరోవైపు, పోనుపోను ప్రమాద ఉద్ధృతి ఇంతలంతలవుతోంది. ప్రపంచంలో విద్యారంగానికి సంబంధించి సైబర్‌ దాడుల ముప్పు ఇండియాకే అత్యధికమని సింగపూర్‌ సంస్థ అధ్యయనం ఇటీవల వెల్లడించింది. నిరుడు ఫిబ్రవరి నాటి సైబర్‌ దాడిలో 45 లక్షల మంది ఎయిరిండియా వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బట్టబయలయ్యాయి. అంతకుముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి చోరీచేసిన తొమ్మిది లక్షల మంది రైలు ప్రయాణికుల ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే కోటీ 80 లక్షల దాకా సైబర్‌ దాడులు నమోదయ్యాయి. సైబర్‌ భద్రత సూచీలో అమెరికా, యూకే, సౌదీ అరేబియా, ఎస్తోనియాలు ముందువరసలో నిలుస్తుండగా- ఇండియాలో పౌరభద్రతకు సైబర్‌ సవాలు అంతకంతకూ పోటెత్తుతోంది. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటివి సైబర్‌ భద్రత కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ నెలకొల్పగా- రెండు దశాబ్దాల క్రితమే సైబర్‌ నిపుణుల రూపకల్పనకు ఇజ్రాయెల్‌ ప్రణాళికలు అల్లింది! సైబర్‌ నేరాలపై విస్తృత జనచేతన పెంపొందించడంతో పాటు నవతరం నుంచి సాంకేతిక సైనికుల సృజనకు పాఠ్యప్రణాళికల ప్రక్షాళనను కేంద్రం ఇకనైనా చురుగ్గా చేపట్టాలి. తొమ్మిదేళ్లనాటి భద్రతా విధానానికి సానపట్టి, రాష్ట్రాల్ని కూడగట్టి, జాతీయ స్థాయిలో సురక్షిత ఉమ్మడి సైబర్‌ సేనను తీర్చిదిద్దితేనే- డిజిటల్‌ ఇండియా సౌధం దృఢంగా నిలదొక్కుకుంటుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.