విస్తరించాలి... సైబర్‌ రక్షణ ఛత్రం!

అంతర్జాలంలో అదృశ్య చోర ముఠాల వీర విజృంభణ కారణంగా దేశంలో పోనుపోను సైబర్‌ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. ఐ4సీ (భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం) వెల్లడించిన లెక్కల ప్రకారం, 2021 ఏప్రిల్‌ నుంచి 2023 డిసెంబరు ముగిసే నాటికి దేశంలో సైబర్‌ ముఠాలు దోచుకున్న మొత్తం రూ.10,319కోట్లు.

Published : 19 Mar 2024 00:50 IST

అంతర్జాలంలో అదృశ్య చోర ముఠాల వీర విజృంభణ కారణంగా దేశంలో పోనుపోను సైబర్‌ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. ఐ4సీ (భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం) వెల్లడించిన లెక్కల ప్రకారం, 2021 ఏప్రిల్‌ నుంచి 2023 డిసెంబరు ముగిసే నాటికి దేశంలో సైబర్‌ ముఠాలు దోచుకున్న మొత్తం రూ.10,319కోట్లు. వెలుగులోకి రాని కేసులలో సైబరాసురులు మింగేసినదెంతో ఎవరికీ తెలియదు. బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.1127కోట్లను విజయవంతంగా స్తంభింపజేయగలిగినట్లు ఐ4సీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 89శాతం దోపిడి సొత్తు సైబర్‌ బందిపోట్ల పాలబడిందన్న మాట! నిరుడీ రోజుల్లో పవన్‌కుమార్‌ సోనీ అనే రాజస్థానీ రైతు ఖాతానుంచి నకిలీ యాప్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఎనిమిది లక్షల రూపాయలకుపైగా దోచేశారు. బాధితుడి తక్షణ ఫిర్యాదుతో కేటుగాళ్ల కదలికల్ని పసిగట్టిన యంత్రాంగం రూ.6.24లక్షలదాకా రాబట్టగలిగింది. ఐ4సీకి కేటాయించిన ‘1930’కి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా మోసగాళ్లు కొట్టేసిన సొమ్మును ఖాతాల్లో స్తంభింపజేస్తున్నా- అది కుట్రపూరితంగా దోచుకున్న మొత్తమని బాధితుల తరఫున దర్యాప్తు సంస్థలు కోర్టులో నిరూపించాల్సి వస్తోంది. ఏ కారణంగానైనా స్తంభింపజేసిన సొమ్మును బాధితుడికి అప్పగించేలా ఆదేశాలిచ్చే అధికారాన్ని నేర శిక్షాస్మృతిలోని 457 సెక్షన్‌ న్యాయమూర్తికి దఖలుపరుస్తోంది. ఆ సెక్షన్‌ సాయంతో గుజరాత్‌లో ప్రత్యేక లోక్‌అదాలత్‌లు నిరుడు నెల్లాళ్ల వ్యవధిలో 3904మంది సైబర్‌ బాధితులకు రూ.8.29కోట్ల మేర ప్రయోజనం కలిగించాయి. తాజాగా తెలంగాణలో లోక్‌అదాలత్‌ల ద్వారా ఒక్కరోజులోనే 546మంది బాధితులకు రూ.2.19కోట్లదాకా సొమ్ము తిరిగి దక్కడం, సరికొత్త రికార్డుగా మన్ననలందుకుంటోంది!

ఈ సంవత్సరం మొదట్లో ఒక వ్యాపారికి మత్తుమందుల పార్సిల్‌ వచ్చిందని, కేసు పెడితే జైలు తథ్యమని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు రూ.98లక్షలు రాబట్టారు. కొన్ని క్షణాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న 11 ఖాతాల్లోకి ఆ సొమ్మును మళ్ళించి రూ.15లక్షలు తీసుకున్నారు. తెలంగాణ సైబర్‌ భద్రతా విభాగం తుపాను వేగంతో స్పందించి రూ.83లక్షలు రాబట్టగలిగింది. పటిష్ఠ నెట్‌వర్క్‌ కలిగిన సైబర్‌ దళాల ఆనుపానులు దొరకబుచ్చుకొని వాటినుంచి దోపిడిసొత్తును కక్కించాలంటే- అంతకుమించిన వేగాన్ని, సాంకేతిక ప్రజ్ఞను ప్రభుత్వాలు కనబరచాల్సి ఉంటుంది! ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సైబర్‌ చోరుల ముసుగును ఎలా తొలగించాలో, కొట్టేసిన సొమ్మును ఎక్కడికి ఎలా మళ్ళించారో కనుగొనేందుకు రూపొందించిన ‘క్రైమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌’ యాప్‌ తెలంగాణ పోలీస్‌ విభాగం అమ్ములపొదిలో అస్త్రంగా మారింది. ఝార్ఖండ్‌ పోలీస్‌శాఖ సిద్ధపరచిన ‘ప్రతిబింబ్‌’ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సైబర్‌ నేరాల దర్యాప్తులో మరో అస్త్రం కాగలదంటున్నారు. ‘112’ నంబరుకు ఫిర్యాదు చేరిన రెండు గంటల్లోగా కొట్టేసినవాడి ఖాతానుంచి బాధితుడికి సొమ్మును భద్రంగా అందించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను తొలుత పట్టాలకు ఎక్కించిన ఘనత బెంగళూరు నగర పోలీస్‌ విభాగానిది. భిన్న రాష్ట్రాల స్థాయుల్లో వ్యక్తమవుతున్న ఈ చొరవ వాటిమధ్య సమాచార మార్పిడికి బాటలు పరిస్తే- అవి సైబర్‌ ఉగ్రవాదానికి యమపాశాలవుతాయి. సైబర్‌ ఘాతుకాలపై ప్రజలెవరైనా ఇంటినుంచే ఫిర్యాదులు చేయడానికి కేంద్రం 2019 ఆగస్టులోనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీసీఆర్‌పీ)ను ఏర్పరచింది. అక్కడ నమోదైన ఫిర్యాదులకు సంబంధించి విచారణ ప్రక్రియ మందకొడిగా అఘోరిస్తోంది. సైబర్‌ భద్రతలో డెన్మార్క్‌, జర్మనీ, అమెరికా అగ్రపథాన సాగుతుండటానికి వాటి పటిష్ఠ కార్యాచరణే ప్రధాన కారణం. కెనడా, బ్రెజిల్‌, ఇంగ్లాండ్‌ వంటివీ సైబర్‌ నేరాల నియంత్రణ వ్యూహాలకు నిరంతరం పదును పెట్టుకుంటున్నాయి. దేశ పౌరులెవరూ సైబర్‌ నేరగాళ్ల పాలబడకుండా అడ్డుకొనే జాతీయ ఉమ్మడి సేనను కొలువుతీర్చడంలో, ఏకోన్ముఖంగా నడిపించడంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలి. బరితెగించిన దోపిడికి కళ్ళెం పడేదప్పుడే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.