చరిత్రహీనుడు జగన్‌

అసమర్థుణ్ని అందలం ఎక్కిస్తే రాష్ట్రం ఎన్ని విధాలుగా దురవస్థల పాలవుతుందో జగన్‌ మోహన్‌రెడ్డి జమానా కళ్లకు కడుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి. విభజన చట్టం మేరకు జాతీయ హోదా పొందిన పోలవరం సజావుగా పూర్తి అయితే 7.2లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొచ్చి, మరో 23.5లక్షల ఎకరాలకు నీటి వసతి స్థిరీకరణ సాధ్యపడేది.

Published : 09 May 2024 02:07 IST

అసమర్థుణ్ని అందలం ఎక్కిస్తే రాష్ట్రం ఎన్ని విధాలుగా దురవస్థల పాలవుతుందో జగన్‌ మోహన్‌రెడ్డి జమానా కళ్లకు కడుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి. విభజన చట్టం మేరకు జాతీయ హోదా పొందిన పోలవరం సజావుగా పూర్తి అయితే 7.2లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొచ్చి, మరో 23.5లక్షల ఎకరాలకు నీటి వసతి స్థిరీకరణ సాధ్యపడేది. 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన, 28.5లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్రానికి అక్షరాలా వరదాయిని! ప్రొటోకాల్‌ ప్రకారం పనులు చేసుకొంటూ వెళితే, అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు నిర్మాణం జరిగి సత్ఫలితాలిస్తుందని సుద్దులు చెప్పిన జగన్‌- తన అవినీతి అసమర్థతలతో పోలవరాన్ని భ్రష్టు పట్టించారు.  ప్రాజెక్టు నిర్మాణానికి మళ్ళీ టెండర్లు పిలిస్తే నష్టమే తప్ప లాభం లేదని, వ్యయం పెరగడంతో పాటు పనుల్లోనూ జాప్యం జరుగుతుందనీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2019లోనే హెచ్చరించింది. దాన్ని బేఖాతరు చేసి, గుత్తేదారుకు ఉండాల్సిన సాంకేతిక అర్హతల్ని అస్మదీయుల సత్తాకు తగ్గట్లు అరగదీసిన జగన్‌ పెడసరంతో అయిదేళ్లుగా ప్రాజెక్టు పడకేసింది. గతంలో డ్యామ్‌ మొత్తాన్ని రూ.1548 కోట్లకు పద్నాలుగు నెలల్లోనే పూర్తి చేసేందుకు నిర్ణయించగా- అదనపు పనులు, అవసరం లేని ఎత్తిపోతల నిర్మాణాల పేరిట మేఘా సంస్థకు మరో రూ.3000 కోట్లు చిత్తగించడంలో జగన్‌ చేతివాటం ప్రస్ఫుటమవుతోంది. కొత్తగా చేపట్టిన వాటిలో నాణ్యత కొరవడి, నిర్వహణ లోపాలు జతపడి మొత్తం ప్రాజెక్టే ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని దుస్థితి నేడు దాపురించింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ల గ్యాప్‌లను సరైన సమయంలో పూడ్చకపోవడంతో 2020నాటి భారీ వరదలకు డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. అలాగే గైడ్‌ బండ్‌ కుంగిపోయింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు లీకేజీ సమస్యలూ ఉన్నాయి. ‘ఇలాంటి చిన్నచిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి’ అని జగన్‌ చప్పరించేసినా వాటి మరమ్మతుల విలువ రూ.1000కోట్లు! పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్లుగా ఉన్న జగన్‌ సర్కారు నిర్వాకానికి నిష్కృతి లేదు!

బంపర్‌ మెజారిటీ ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకు వస్తానన్న జగన్‌- మాటలు మోత, చేతలు రోత! చంద్రబాబు హయాములో పోలవరానికి రూ.10,649కోట్లు వ్యయీకరిస్తే, జగన్‌ వెచ్చించింది రూ.5,877కోట్లు! పోలవరానికి సంబంధించి 70శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే పూర్తికాగా, జగన్‌ సర్కారు అతికష్టంమీద మరో అయిదుశాతంతో సరిపుచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులు రాబట్టలేక పోవడమే కాదు, బడ్జెట్లో తాను కేటాయింపులు చేసిన మేరకైనా ఖర్చు చేయలేని జగన్‌ పాలన పోలవరాన్ని అంపశయ్య మీదకు చేర్చేసింది. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌- తెలుగుదేశం పట్ల రాజకీయ విద్వేషంతో పోలవరంలో పెను విధ్వంసాన్నే సృష్టించారు! పోలవరం ముందుకు సాగాలంటే, అంతర్జాతీయ నిపుణులతో డిజైన్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి వారి సలహా సంప్రదింపులతో నిర్మాణం చేపట్టడం ఒక్కటే గత్యంతరమని కేంద్ర జల సంఘం మొన్నామధ్య స్పష్టీకరించింది. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీతో కలిపి పోలవరం రెండు దశలకూ రూ.55,548కోట్ల సవివర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను కేంద్రం ఆమోదించాలి. చంద్రబాబు హయాములోనే సాంకేతిక సలహా కమిటీ, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీలు తమ తుది అంచనా వ్యయాల్ని కేంద్రానికి నివేదించాయి. అయిదేళ్లుగా వాటిపై కేంద్రం మొహరు వేయించలేకపోయింది జగన్‌ సర్కారు. కేంద్రం నుంచి నిధులు ప్రవహిస్తే తప్ప పునరావాస ప్యాకేజీపై తానుగా చెయ్యగలిగిందేమీ లేదని నేడు జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారు. 373 ఆవాస గ్రామాల్లోని దాదాపు లక్ష కుటుంబాలు నాలుగేళ్లుగా దురవస్థలపాలవుతున్నా ఉత్తుత్తి వాగ్దానాలు తప్ప జగన్‌ ఉద్ధరించిందేమీ లేదు. పోలవరం నిర్వాసితులకు వ్యక్తిగత ప్యాకేజీని రూ.10లక్షలకు పెంచుతూ 2021లోనే జీఓ జారీ చేసినా, ఏ ఒక్క కుటుంబానికీ ఆ ఆర్థికదన్ను దక్కనేలేదు! ఇలా నిర్వాసితుల్ని దారుణంగా వంచించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గండికొట్టి, రాయలసీమ కరవు ప్రాంతాల ప్రయోజనాల్నీ కసిగా కాలరాసిన జగన్‌- పోలవరాన్ని పాడుచేసిన చరిత్ర హీనుడు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.