Ukraine Crisis: ప్రపంచం ఉలిక్కిపడిన వేళ..

ఉక్రెయిన్‌ యుద్ధంలో అణుముప్పు దోబూచులాడుతూనే ఉంది. ఐరోపాలోని అతిపెద్ద అణు కర్మాగారాల్లో ఒకటైన జపోరిజియా ప్లాంట్‌పై రష్యా దాడి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అక్కడి రియాక్టర్‌ అగ్నికీలల్లో చిక్కుకుందన్న వార్తలు ప్రపంచానికి 1986 నాటి చెర్నోబిల్‌ ప్రమాదాన్ని కళ్లకు కట్టాయి.

Updated : 05 Mar 2022 06:38 IST

ఉక్రెయిన్‌ యుద్ధంలో అణుముప్పు దోబూచులాడుతూనే ఉంది. ఐరోపాలోని అతిపెద్ద అణు కర్మాగారాల్లో ఒకటైన జపోరిజియా ప్లాంట్‌పై రష్యా దాడి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అక్కడి రియాక్టర్‌ అగ్నికీలల్లో చిక్కుకుందన్న వార్తలు ప్రపంచానికి 1986 నాటి చెర్నోబిల్‌ ప్రమాదాన్ని కళ్లకు కట్టాయి. మళ్లీ అలాంటి అణు విపత్తు చెలరేగి, ఐరోపా మొత్తం రేడియోధార్మికత వ్యాపిస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే మంటలను అదుపులోకి తెచ్చామని ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రియాక్టర్‌ కంపార్ట్‌మెంట్‌ దెబ్బతిన్నప్పటికీ భద్రతాపరంగా  ఇబ్బంది తలెత్తకపోవడం, రేడియోధార్మికత లీక్‌ కాకపోవడం ఊరటనిచ్చింది.
ఫిరంగి గుళ్లు నేరుగా జపోరిజియా అణు కేంద్రంపై పడ్డాయని, ఫలితంగా ఆరు రియాక్టర్లలో ఒకదాని చుట్టూ ఉన్న భవనం అగ్నికీలల్లో చిక్కుకుందని ప్లాంట్‌ అధికార ప్రతినిధి ఆండ్రీ టజ్‌ చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చామన్నారు.  

ఈ దాడి ఎంత ప్రమాదకరం?
ఇలాంటి దాడి చాలా ప్రమాదకరం. రియాక్టర్‌, దాని చుట్టూ ఉన్న భవనం దెబ్బతినడం అవాంఛనీయం. అలాంటి పరిస్థితుల్లో రియాక్టర్‌ వేడెక్కి, అందులోని కోర్‌ భాగం కరిగిపోతుంది. దీన్ని ‘మెల్ట్‌డౌన్‌’ అంటారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి రేడియోధార్మికత వెలుడుతుంది. దీనివల్ల తక్షణ, దీర్ఘకాల అనారోగ్యం, క్యాన్సర్లు వంటివి  తలెత్తుతుంటాయి. 1986లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు కర్మాగారంలో ఇదే జరిగింది. దీనివల్ల క్యాన్సర్ల బారినపడి 93 వేల మంది చనిపోయినట్లు అంచనా.

విద్యుత్‌ నిలిచిపోతే ఏమవుతుంది?
అణు విచ్ఛిత్తి పరిజ్ఞానాన్ని ఉపయోగించి రియాక్టర్‌ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటారు. దీన్ని నీటితో నిరంతరం చల్లబరుస్తుండాలి. దీనికి సంబంధించిన  ప్రత్యేక వ్యవస్థకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రమాదకరం. అందువల్ల రియాక్టర్‌ను నేరుగా పేల్చేయడమే కాదు.. దానికి కరెంటు సరఫరాను నిలిపివేసినా ముప్పే. శుక్రవారం దాడి జరిగిన సమయంలో ఆరు రియాక్టర్లకుగాను ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. మిగతావి పనిచేయడం ఆగిపోయినా.. ఉన్నపళంగా వాటిలో వేడి చల్లారదు. వాటిని క్రమంగా చల్లబరచడాలి. ఇందుకు నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలి. ఒకవేళ కరెంటు నిలిచిపోతే అంతగా విశ్వసనీయం కాని డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. డీజిల్‌ నిండుకుంటే అవి ఆగిపోతాయి. అత్యవసర సమయాల్లో ఈ ఇంధనాన్ని సరఫరా చేయడం కుదరకపోవచ్చు. 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణుకర్మాగారంలో ఇదే జరిగింది. ఫలితంగా నాడు మూడు రియాక్టర్లలోని కోర్‌భాగాలు వేడెక్కి, కరిగిపోయి అణు ధార్మికత వెలువడింది. జపోరిజియాలో అలాంటి పరిస్థితి తలెత్తితే ఐరోపా మొత్తానికీ పెను ముప్పు తప్పదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.
ముప్పు రియాక్టర్‌కేనా?
అణు కర్మాగారాల్లో వాడేసిన ఇంధన కడ్డీలు భారీగా ఉంటాయి. వాటిని నీటి మడుగుల్లో ఉంచుతారు. వాటినీ చల్లబరుస్తూ ఉండాలి. అయితే అణు రియాక్టర్‌ తరహాలో అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు ఉండవు. అవి చాలా తేలిగ్గా శతఘ్ని దాడులకు గురవుతుంటాయి.  
మరో చెర్నోబిల్‌ అయ్యేదా?
చెర్నోబిల్‌తో పోలిస్తే జపోరిజియా కర్మాగారం కాస్త మెరుగైంది. భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కువగా ఉన్నాయి. రియాక్టర్‌ను స్టీల్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ భవనంలో ఉంచారు. ట్యాంకులు, శతఘ్ని గుళ్లను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. పైగా ఈ రియాక్టర్‌లో గ్రాఫైట్‌ లేదు. చెర్నోబిల్‌లో గ్రాఫైట్‌ వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఐరోపా అంతటా వ్యాపించిన రేడియోధార్మిక సెగకు ఇదే ప్రధాన కారణమైంది. అయినా జపోరిజియా ప్లాంట్‌.. తమిళనాడులోని కూడంకుళం అణు కర్మాగారం తరహాలో ఆధునికమైంది కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల అగ్నికీలలు పెద్దవైతే చెర్నోబిల్‌ కన్నా పదిరెట్లు ఎక్కువ నష్టం జరిగేదని చెబుతున్నారు.
ఇంకా ముప్పు పొంచి ఉందా?
ఉక్రెయిన్‌ భారీగా అణుశక్తిపై ఆధారపడుతోంది. దేశంలో నాలుగు అణు కేంద్రాలు ఉన్నాయి. వాటిలోని 15 రియాక్టర్లు దేశంలోని సగం మేర విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. యుద్ధంతో వీటికి ముప్పు పొంచి ఉంది. చెర్నోబిల్‌ అణు కర్మాగారం నుంచి ఇంకా రేడియోధార్మికత లీకవుతోంది. అది ఇప్పటికే రష్యా సైన్యం చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. అక్కడి సిబ్బంది పుతిన్‌ సేన అజమాయిషీలో పనిచేస్తున్నారు.
జపోరిజియా వివరాలివీ..
ఐరోపాలోని 10 భారీ అణువిద్యుత్‌ కేంద్రాల్లో ఇదొకటి.
ఇందులో ఆరు వీవీఆఆర్‌-1000 ప్రెజరైజడ్డ్‌ లైట్‌ వాటర్‌ రియాక్టర్లు (పీడబ్ల్యూఆర్‌) ఉన్నాయి.
ఒక్కో రియాక్టర్‌ సామర్థ్యం: 950 మెగావాట్లు
మొత్తం సామర్థ్యం: 5,700 మెగావాట్లు (తమిళనాడులోని కూడంకుళం అణు కేంద్రంతో పోలిస్తే మూడు రెట్లు పెద్దది)
ఉక్రెయిన్‌లో మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్‌ వాటా: 54 శాతం

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని