Pingali Venkayya: తెలుగు తేజం.. కీర్తి ‘పతాకం’

భారతావని స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో స్ఫూర్తి నింపిన ఆ జెండా రూపకర్త మన పింగళి

Updated : 02 Aug 2022 06:58 IST

పరితపించి... పతాకమై ఎగిరి!
మువ్వన్నెల జెండా ఆయన చలవే
నేడు పింగళి 146వ జయంతి

భారతావని స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో స్ఫూర్తి నింపిన ఆ జెండా రూపకర్త మన పింగళి వెంకయ్య.. ఆయన రూపొందించిన ఆ త్రివర్ణ పతాకమే నేటికీ కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని ప్రతిబింబించే చిహ్నంగా విరాజిల్లుతోంది. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

అది 1916వ సంవత్సరం. దేశానికి స్వాతంత్య్రం సాధించే విధానాలపై లఖ్‌నవూలో కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. అదే సమయంలో ఒక బక్క పలచని వ్యక్తి తన చేతిలోని పుస్తకాన్ని, చిన్న వస్త్రాన్ని కనిపించిన ప్రతి నేతకూ చూపిస్తున్నారు. తన ప్రతిపాదనపై ఆలోచించాలని కోరుతున్నారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే... ప్రతి ఏడాది కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడ సమావేశమైతే అక్కడికి వెళ్లడం, వారిని కలవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇలా అయిదేళ్లకు ఆయన కల నెరవేరింది. యావత్‌ భారతానికి త్రివర్ణ పతాకమై అందింది. తన పట్టుదలతో దేశానికి జెండాను అందించిన వ్యక్తి... మన పింగళి వెంకయ్య.

కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య జన్మించారు. తండ్రి హనుమంతనాయుడు యార్లగడ్డ గ్రామ కరణం. తల్లి వెంకటరత్నం గృహిణి. మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యను చదివారు. సేద్యంపై మక్కువతో వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. లాహోర్‌ వెళ్లి ఆంగ్లో వేదిక్‌ విద్యాలయంలో సంస్కృతం, ఉర్దూ, జపనీస్‌ భాషల్లో ప్రావీణ్యం పొందారు. గనులు, వజ్రాలపై పరిశోధనలు చేశారు. పామర్రు గ్రామ కరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. అనంతరం 1895లో సైన్యంలో చేరి బోయర్‌ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడే గాంధీజీతో ఆయనకు పరిచయమైంది. భారత్‌కు తిరిగొచ్చాక తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం జమీందారు రాజానాయని వెంకట రంగారావు కోరిక మేరకు 1909లో అక్కడికి చేరుకుని వ్యవసాయశాఖ అధిపతిగా పనిచేశారు. ఈ ప్రాంతానికి పత్తిని పరిచయం చేశారు. అమెరికా నుంచి తెప్పించిన కాంబోడియన్‌ రకం పత్తికి స్థానిక వంగడాలను జోడించి కొత్తవంగడాన్ని సృష్టించారు. నాటి నుంచి ఆయన్ని పత్తి వెంకయ్యగా పిలిచేవారు. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు.

అయిదేళ్ల నిర్విరామ ప్రయత్నం

వెంకయ్య కళాశాలలో పనిచేస్తూనే కాంగ్రెస్‌ జాతీయ సమావేశాల్లో పాల్గొనేవారు. అలా 1906లో కోల్‌కతాలో నిర్వహించిన సమావేశంలో తొలుత బ్రిటిషర్ల యూనియన్‌జాక్‌ను ఎగరవేయడాన్ని చూసి తల్లడిల్లారు. మనకూ సొంతంగా పతాకం ఉండాలని పట్టుదలగా ప్రయత్నం ప్రారంభించారు. వివిధ దేశాల పతాకాలను అధ్యయనం చేసి, 30 రకాల నమూనాలు తయారు చేశారు. 1916 నాటికి ‘ఎ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే బుక్‌లెట్‌ను తయారు చేశారు. దీన్ని తీసుకుని అయిదేళ్లపాటు ప్రతీ జాతీయ సమావేశానికి వెళ్లడం, కాంగ్రెస్‌ నాయకులకు దాన్ని చూపించడం, జెండా ఆవశ్యకతను వివరించడం చేసేవారు. చివరికి 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో తనకున్న పరిచయంతో గాంధీజీని కలుసుకున్నారు.

తొలుత రెండు రంగులే

గాంధీజీకి తాను రూపొందించిన హిందూ, ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను వెంకయ్య చూపించారు. పంజాబ్‌కు చెందిన విద్యావేత్త లాలాహన్స్‌రాజ్‌ సూచనతో రాట్నం గుర్తును గంటల వ్యవధిలోనే జత చేసి, చూపించారు. అబ్బురపడిన గాంధీజీ... తన యంగ్‌ ఇండియన్‌ పత్రికలో వెంకయ్య ఉత్సాహాంపై వ్యాసం రాశారు. తర్వాత శాంతి, అహింసలకు ప్రతీకగా తెలుపు రంగునూ ఆయన స్వయంగా జతచేశారు. చివరికి 1931లో జరిగిన సమావేశంలో ఎరుపు రంగును కాషాయంగా మార్చి రంగుల వరుసను మార్చేశారు. స్వాతంత్య్రం వచ్చాక జెండా మధ్యలో రాట్నం బదులు అశోక చక్రాన్ని చేర్చారు. అప్పుడు వెంకయ్య జెండా వెంకయ్యగా మరారు.

రాజకీయాలకు దూరం: స్వాతంత్య్రానంతరం వెంకయ్య నెల్లూరులో స్థిరపడ్డారు. రాజకీయాలకు దూరంగా ఉండి, విద్యారంగంపై దృష్టిసారించారు. ఒకవైపు పేదరికం వెన్నాడుతున్నా జెమాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వనరులపై నివేదిక రూపొందించేందుకు ప్రయత్నించారు. చివరికి 1963 జులై 4న పరమపదించారు.

- ఈనాడు, ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని