icon icon icon
icon icon icon

Lok Sabha Polls: నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్‌-3 ఎవరంటే?

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్‌ సంస్థ వెల్లడించింది.

Published : 05 May 2024 18:00 IST

దిల్లీ: ఒకవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు, రాజకీయ ప్రచారంతో తెలుగు రాష్ట్రాల్లో వేడి మామూలుగా లేదు. సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) నాలుగో విడతలో భాగంగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలూ అదే రోజు జరగనున్నాయి. వీటితో పాటు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 96 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అగ్రనేతల ప్రచార పర్వం తారస్థాయిలో కొనసాగుతోన్న వేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల అఫిడవిట్‌లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ADR) సంస్థ విశ్లేషించి ఆ వివరాలు వెల్లడించింది. అభ్యర్థులు పేర్కొన్న ఆస్తులు, విద్యార్హతలు, క్రిమినల్‌ కేసుల వివరాలను నివేదికలో పేర్కొంది. నాలుగో విడత ఎన్నికల్లో మొత్తంగా 1,717 మంది బరిలో ఉండగా.. 1710మంది అఫిడవిట్‌లను విశ్లేషించి గణాంకాలతో నివేదిక రూపొందించింది.

దీని ప్రకారం నాలుగో విడత ఎన్నికల బరిలో ఉన్న ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో 476 మంది (28శాతం) కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. వీరి ఆస్తి రూ.కోటి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. భాజపా నుంచి బరిలో నిలిచిన 70 మందిలో 65మంది (93%).. కాంగ్రెస్‌ నుంచి 61మందిలో 56మంది (92%) కోటీశ్వరులే ఉన్నట్లు తెలిపింది. ఈ విడతలో పోటీ చేస్తోన్న అభ్యర్థి సగటు ఆస్తి ₹11.72 కోట్లుగా పేర్కొంది.  భాజపా నుంచి 70మంది బరిలో ఉండగా.. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి ₹101.77 కోట్లు కాగా.. కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న 61 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు ₹23.65 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇకపోతే, అత్యధిక ఆస్తులు కలిగి వున్న టాప్‌- 3 అభ్యర్థుల్లో గుంటూరు తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ (రూ.5,705కోట్లకు పైనే),  చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (రూ.4,568 కోట్లకు పైనే), నెల్లూరు తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (రూ.716కోట్లకు పైనే) ఉన్నారని తెలిపింది. 

21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

బరిలో నిలిచిన వారిలో 360 మంది అభ్యర్థుల (21శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. వీటిలో 274 (16 శాతం) మంది అభ్యర్థులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటుండగా.. 11 మందిపై హత్యా నేరం, 50 మందిపై మహిళలపై అత్యాచారాలు వంటి నేరారోపణలు, 44 మందిపై విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలిపింది. విద్యార్హతల విషయానికి వస్తే.. 944 మంది (55శాతం) అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌, ఆపై చదువులు అభ్యసించగా.. 66 మంది డిప్లొమా, 644 మంది (38శాతం) ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివినట్లు పేర్కొంది. 30 మంది కేవలం అక్షరాస్యులుగా మాత్రమే పేర్కొనగా.. 26 మంది నిరక్షరాస్యులుగా అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తెలిపింది. నాలుగో విడత బరిలో ఉన్న  మొత్తం అభ్యర్థుల్లో కేవలం 10 శాతం (170) మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అలాగే, 642 మంది అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 (38శాతం) కాగా.. 842 మంది అభ్యర్థుల వయస్సు 41-60 మధ్య (49 శాతం), 226 మంది అభ్యర్థుల వయసు 61 నుంచి 80 ఏళ్లు (13శాతం)గా నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img