icon icon icon
icon icon icon

Loksabha polls: కాంగ్రెస్ అమేఠీ కార్యాలయంపై దాడి.. వాహనాలు ధ్వంసం

అమేఠీలోని కాంగ్రెస్‌ కార్యాలయంపై దుండగులు ఆదివారం దాడి చేసినట్టుగా పార్టీ పేర్కొంది. 

Published : 06 May 2024 14:30 IST

అమేఠీ: అమేఠీలోని కాంగ్రెస్ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు డాడి చేశారు. దాడిలో వారు కార్యాలయం బయట పార్క్‌ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో భాజపా నాయకుల కుట్ర ఉండొచ్చని  కాంగ్రెస్ ఆరోపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఆధారంగా దుండగులపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.  

ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో భాజపా గూండాలు కర్రలు, రాడ్లతో అమేఠీలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. పార్టీ కార్యకర్తలు, అమేఠీ ప్రజలపై దాడి చేశారు. ఇందులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికుల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.  ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహించారు. వాహనాలను బద్దలు కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అమేఠీలో భాజపా ఓడిపోతుందనడానికి ఇదే నిదర్శనం’’అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. 

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు(సోమవారం) రాయ్‌బరేలీ, అమేఠీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  నేటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఆమె ఈ రెండు నియోజకవర్గాల్లోని పలు ప్రచార కార్యక్రమాలకు హాజరవుతారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, అమేఠీ నుంచి కిషోరి లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు.

ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐదవ రౌండ్‌లో రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img