icon icon icon
icon icon icon

భారాస నేత మన్నె క్రిశాంక్‌ అరెస్టు

భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు.

Published : 02 May 2024 02:54 IST

తమ పార్టీకి అనుకూలంగా ఓయూ సర్క్యులర్‌ను మార్చారని అభియోగం

ఈనాడు- హైదరాబాద్‌, చౌటుప్పల్‌ గ్రామీణం, నల్గొండ అర్బన్‌- న్యూస్‌టుడే: భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సర్క్యులర్‌ తప్పుగా మార్చి ప్రచారం చేశారన్నది ఆయనపై అభియోగం. బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వస్తున్న క్రిశాంక్‌ను పోలీసులు పంతంగి టోల్‌గేట్‌ దగ్గర అడ్డుకున్నారు. తొలుత చౌటుప్పల్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకూ ఆయన ఎక్కడున్నారో గోప్యంగా ఉంచారు. సాయంత్రం తర్వాత క్రిశాంక్‌ను అరెస్టు చేసినట్లు ఓయూ పోలీసులు ధ్రువీకరించారు. ఓయూ హాస్టళ్లు, మెస్‌లు మూసేయడంపై సామాజిక మాధ్యమాల్లో నకిలీ నోటీసులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులు మంగళవారం ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు భారాస నేత క్రిశాంక్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు క్రిశాంక్‌ను పట్టుకున్నారు. ఈయనపై గతంలో 14 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని రిమాండు రిపోర్టులో ప్రస్తావించారు.

ఖండించిన జగదీశ్‌రెడ్డి..

క్రిశాంక్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలోని భారాస కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగాయన్నారు. క్రిశాంక్‌ విషయంపై నల్గొండ ఎస్పీని వివరణ అడిగామని, తమకేమీ తెలియదని చెప్పారన్నారు. దీనిపై డీజీపీ స్పందించాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img