icon icon icon
icon icon icon

డ్రాగన్‌ కుట్రలు.. ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం ఇలా..

ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలో చైనా జోక్యం పెరుగుతోంది. డ్రాగన్‌ కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Updated : 07 May 2024 13:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా.. వాటి ఎన్నికల ప్రక్రియలోనూ వేలు పెడుతోంది. డ్రాగన్‌పై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు చేయగా.. తాజాగా కెనడా కూడా చైనా చర్యలను బట్టబయలు చేసింది. 2019, 2021లో తమ దేశంలో జరిగిన ఫెడరల్‌ ఎన్నికలను చైనా రహస్యంగా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ నివేదిక తాజగా వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.

అత్యాధునిక పరికరాలతో బీజింగ్‌ తన రాజకీయ అజెండాలను ఇతర దేశాలపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు చైనా ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు పొందడం దాని లక్ష్యం. షీ జిన్‌పింగ్‌ ప్రభుత చర్యలు ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున  డ్రాగన్‌ చర్యలను ఓ కంట కనిపెట్టాలని అంటున్నారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ..

ఇన్‌ఫ్లూయెన్స్‌ ఆపరేషన్స్‌(IO) ద్వారా చైనా ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇతర దేశాల నేతలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వారిని బలహీనమైన నేతలుగా ప్రచారం చేయడం ఈ ఐవోలో ప్రధానమైనది. వివిధ సోషల్‌ మీడియా వేదికల ద్వారా 2017-18 నుంచే చైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. 2023లో మెటా ఈ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన తొమ్మిది వేల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలను బ్యాన్‌ చేసిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకే, అమెరికా, అస్ట్రేలియా లాంటి దేశాలే లక్ష్యంగా 50కిపైగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి ప్రచారాలను గుర్తించారు.

అంతిమ లక్ష్యం అదే..

సోషల్‌ మీడియానే కాకుండా చైనీస్‌ ఐవో వ్యూహాల్లో ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. రహస్య వ్యూహాలతో చైనా తన కుట్రలను అమలు చేస్తోంది. స్థానిక, స్వతంత్ర మీడియా, రాజకీయ పార్టీలు, వ్యాపార వేత్తలు, ఎన్జీవోలను ప్రభావితం చేయడం ఇందులో భాగం. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, ఎన్నికైన నేతలు చైనా అనుకూల వైఖరిని అవలంభించేలా చూడటం చైనీస్‌ ఇన్‌ఫ్లూయెన్‌ ఆపరేషన్స్‌ అంతిమ లక్ష్యం. గత ఏడాది నవంబర్‌లో చైనాకు లింక్‌ అయి ఉన్న 5 వేల ఫేక్‌ సోషల్‌మీడియా అకౌంట్లపై వేటు వేశారు. అమెరికన్లలా నటిస్తూ ఈ ఖాతాల్లో చైనాకు అనుకూల ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో 2022 ఫెడరల్‌ ఎన్నికల సమయంలోనూ డ్రాగన్‌ ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అదే ఏడాది జరిగిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలకే పాల్పడినట్లు సమాచారం.

ఏఐతో కూడా..

తాజాగా కృత్రిమ మేధను కూడా వినియోగించి ఫేక్‌ వీడియోలు, చిత్రాలను సృష్టిస్తోన్నట్లు సమాచారం. చైనాను విమర్శించే పార్టీలు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న భారత్‌తోపాటు, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో ఈ ఏడాది జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ఏఐని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉందని మైక్రోసాఫ్ట్‌ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో కూడా చైనా ఈ టెక్నాలజీ వాడి కుట్రలకు పాల్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img