icon icon icon
icon icon icon

గోస.. తీర్చేవారికే బాసట!

ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బెహరాన్‌, ఒమన్‌లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా అదే బాట పడుతోంది.

Updated : 14 Nov 2023 15:28 IST

ఉమ్మడి జిల్లా ఓటర్లలో 11.55 శాతం గల్ఫ్‌బాధిత కుటుంబాల వారే!

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఎడారి దేశాలకు వలస వెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, బెహరాన్‌, ఒమన్‌లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా అదే బాట పడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళ్తుండటంతో.. వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్న వారు కొందరైతే.. క్షణికావేశంతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది.

ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గల్ఫ్‌ బాధిత కుటుంబాల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 1,96,400 మంది గల్ఫ్‌ బాధిత కుటుంబాల్లో ఓటర్లు ఉండగా.. మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమురంభీంలలో 60 వేల మంది వరకు ఓటర్లు ఉంటారని గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

తలకు మించిన అప్పులు చేసి కోటి ఆశలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారికి చివరకు కష్టాలు, కన్నీళ్లు మిగులుతున్నాయి. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక, సరైన పనిదొరకక, అక్కడి ప్రభుత్వాలు విధించిన చట్టాల కారణంగా.. కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతున్నారు. మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి గుండెపోటుతో మరణిస్తుండగా, ఇంకొందరు అజ్ఞాతవాసంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు గల్ఫ్‌లో ఉన్న వారితోపాటు తిరిగొచ్చిన వారిని, కుటుంబాలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం

గల్ఫ్‌ వలస కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు లేదా ప్రవాసీ విధానం (ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు చేయాలని ఇందుకోసం ఓటు అనే ఆయుధంతో కార్మికుల కుటుంబాలు అభ్యర్థుల గుర్తించేలా చేయాలని ఆయా దేశాల్లోని బాధితులు సూచిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి గల్ఫ్‌ అంశాన్ని గుర్తించే అభ్యర్థులను, పార్టీలను చేరదీయాలని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఓటర్లలో 11.55 శాతం మంది గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు చెందిన వారున్నారు. దీంతో  అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నాయి.

ఇవీ కార్మికుల డిమాండ్లు

  • గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలి
  • కేరళ తరహాలో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాద బీమా, పింఛన్‌తో కూడిన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి
  •  గల్ఫ్‌ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి
  • కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి
  • గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు చెందిన పిల్లల కోసం రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలి.
  • గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ద్వారా వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్‌లో మరణించిన వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలి

నిర్మల్‌ అసెంబ్లీ బరిలో స్వదేశ్‌ పరికిపండ్ల

గల్ఫ్‌ సంక్షేమ బోర్డు, ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈ ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గ స్థానానికి ప్రవాసీమిత్ర కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల పోటీ చేయనున్నారు. ఆయన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి బీఫారం తెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img