icon icon icon
icon icon icon

కమ్యూనిస్టు యోధుడు.. పెండ్యాల

ఒక గ్రామ సర్పంచిగా గెలిచేందుకే నేతలు కుస్తీ పడుతున్న రోజులవి. అంగ, అర్థ బలాలున్న వారికి సైతం ప్రజాప్రతినిధి కావడం కలగానే ఉంటుంది.

Updated : 17 Nov 2023 13:02 IST

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఒక గ్రామ సర్పంచిగా గెలిచేందుకే నేతలు కుస్తీ పడుతున్న రోజులవి. అంగ, అర్థ బలాలున్న వారికి సైతం ప్రజాప్రతినిధి కావడం కలగానే ఉంటుంది. అలాంటిది ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో గెలిచారంటే మీరు నమ్మగలరా..! 70 ఏళ్ల క్రితమే వరంగల్‌ జిల్లాలో ఈ సంచలనం జరిగింది. దేశంలోనే ఈ అరుదైన రికార్డు సాధించిన వ్యక్తి పేరే పెండ్యాల రాఘవరావు..

సామాజిక స్పృహ ఎక్కువ

హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాటాలతో పాటు జాయిన్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న కమ్యూనిస్టు యోధుడు పెండ్యాల రాఘవరావు. మార్చి 15, 1917న ఇప్పటి జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో జన్మించారు. హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అప్పట్లో నిజాం రాజ్యంలో వరంగల్‌ సుభా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. రాఘవరావు కమ్యూనిస్టుల ప్రభావంతో ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులు కావడంతో.. చదువుకు దూరమయ్యారు. అప్పుడప్పుడే వరంగల్‌లో విస్తరిస్తున్న ఆర్య సమాజ్‌ శాఖల్లో పని చేశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా తన గ్రామంలో ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం ఆయన సామాజిక స్పృహకు నిదర్శనం.

చిన్నపెండ్యాలలో ఏర్పాటు చేసిన రాఘవరావు విగ్రహం

జైలు నుంచే నామినేషన్‌..  

1948లో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపేందుకు పోలీస్‌ యాక్షన్‌ జరిపారు. అనంతరం ఏర్పడిన జే.ఎన్‌.ఎస్‌ చౌదరి ఆధ్వర్యంలో మిలటరీ ప్రభుత్వం కమ్యూనిస్టులపై నిర్బంధం విధించింది. ఆ సమయంలో రాఘవరావు 1950లో వరంగల్‌ జిల్లా మల్కాపూర్‌ వద్ద అరెస్టు అయ్యారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు జైలులోనే ఉన్నారు. అక్కడి నుంచే వరంగల్‌ లోక్‌ సభ స్థానానికి, వర్ధన్నపేట, హనుమకొండ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్‌ వేశారు.

వరంగల్‌ ఎంపీగా కాళోజీపై గెలుపు

హనుమకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బీకే రెడ్డిపై 6,628 ఓట్లతో, వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సి.రావుపై 2,803 ఓట్లతో, వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజాకవి కాళోజీపై 3,613 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం పార్టీ సూచన మేరకు హనుమకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలను వదులుకొని వరంగల్‌ ఎంపీగా కొనసాగారు. దేశంలో సంస్థానాలను విలీనం చేసినప్పుడు జమీందార్లు, జాగీర్దార్లకు భారత ప్రభుత్వం నష్ట పరిహారం కింద రూ.లక్షల్లో పారితోషికం ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

‘నా ప్రజా జీవితం’ పేరిట ఆత్మకథ

ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన చిన్నపెండ్యాలలో 1987 సెప్టెంబర్‌ 10న ఆయన మరణించారు. రాఘవరావు చనిపోయిన 20 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె కొండపల్లి నీహరిణి రాఘవరావు గురించిన అనేక వివరాలతో 2007లో ‘నా ప్రజా జీవితం’ పేరిట ఆత్మకథను ప్రచురించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img