icon icon icon
icon icon icon

PM Modi: శరీర రంగుతో అవమానిస్తే సహించేది లేదు: శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ మండిపాటు

మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వరంగల్‌ పరిధిలోని మామునూరులో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 

Updated : 08 May 2024 14:15 IST

వరంగల్‌: మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వరంగల్‌ పరిధిలోని మామునూరులో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.

‘‘కాంగ్రెస్‌ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారు. ఎస్సీల విషయంలో ఆ పార్టీ వెనకడుగు వేసింది. దీనిపై నేనిచ్చిన వాగ్దానం నెరవేరుస్తా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశాం. రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆ ఆదివాసీ బిడ్డను హస్తం పార్టీ వ్యతిరేకించింది. ఆమెను ఓడించాలని యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని ఆ పార్టీ చూస్తోంది? చాలా మంది ప్రజల శరీరరంగు నలుపు ఉంటుంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు.

‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్‌ పిట్రోడా

‘‘కాంగ్రెస్‌ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. ఆ పార్టీ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మోసగించింది. రాష్ట్రంలో అ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోంది. అందులో ఒక భాగం హైదరాబాద్‌.. మరో భాగం దిల్లీకి వెళ్తోంది. భారాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణానికి పాల్పడింది. ఆ పార్టీని రక్షించే పనిలో కాంగ్రెస్‌ ఉంది. కాళేశ్వరం పేరిట జరిగిన నష్టాన్ని ఇప్పుడు రైతులు భరించాల్సిన పరిస్థితి. అన్నదాతకు భాజపా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. రికార్డు స్థాయిలో వరి, పత్తి కొనుగోళ్లు చేశాం. అన్నదాతలకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి అందిస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాం. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసినా సరిగా నిర్వహించట్లేదు’’ అని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img