icon icon icon
icon icon icon

Rahul Gandhi: వాళ్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం: రాహుల్‌

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Published : 05 May 2024 14:31 IST

నిర్మల్‌: భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు భాజపా రుణమాఫీ చేస్తే మాత్రం ఎవరూ అడగటం లేదు. ఈ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరగుతున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్‌ ఉంది. మరోవైపు దాన్ని మార్చే సమూహం ఉంది. 

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది.. ప్రజల పక్షాన ఆలోచిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇస్తాం. ఆదివాసీల భూసమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. కులగణన, ఆర్థిక సర్వే చేస్తాం. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తాం. సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రజల మధ్య భాజపా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోంది. రాజ్యాంగాన్ని మట్టుబెట్టేందుకు చూస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది’’ అని రాహుల్‌ తెలిపారు.

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్‌

ఆదిలాబాద్‌ అంటే ప్రత్యేక అభిమానమని, అందుకే దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తాం. ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తాం. పంద్రాగస్టు లోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశాం. తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img