icon icon icon
icon icon icon

Rahul Gandhi: రామమందిర తీర్పును మార్చేందుకు రాహుల్‌ యత్నం: కాంగ్రెస్‌ బహిష్కృత నేత ఆరోపణలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పై ఆ పార్టీ మాజీ నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు.

Published : 06 May 2024 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సుప్రీంతీర్పును మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తారని ఆచార్య ప్రమోద్‌ కృష్ణం వెల్లడించారు. ‘‘నేను దాదాపు 32 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశాను. ఒకసారి రాహుల్‌ తన సహాయకులతో సమావేశమైన సందర్భంగా రామమందిర అంశం చర్చకు వచ్చింది. ఆ సమయంలో ఆయన స్పందిస్తూ గతంలో షాబానో కేసులో రాజీవ్‌ చేసినట్లుగా మనం సూపర్‌పవర్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసి తీర్పును మార్చేద్దాం’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఓ శ్రేయోభిలాషి (శామ్‌ పిట్రోడా) సూచనమేరకు ఆయన ఈ అభిప్రాయం ఏర్పాటు చేసుకొన్నారని ఓ ఆంగ్ల వార్తాసంస్థతో ప్రమోద్‌ తెలిపారు. ఇక ప్రియాంకగాంధీ కాంగ్రెస్‌, కుటుంబ కుట్రలకు బాధితురాలని ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజుల క్రితమే తాను రాహుల్‌ను అమేఠీ నుంచి పోటీ చేయవద్దని సూచించినట్లు వెల్లడించారు. ప్రమోద్‌ గతంలో ప్రియాంకాగాంధీ బృందంలో ఆరేళ్లపాటు కీలక సభ్యుడిగా పని చేశారు. 

రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ‘‘నాకు ఏ మతంతో సమస్య లేదు. మతాన్ని రాజకీయాలను కలపడంపైనే నా అభ్యంతరం. నెహ్రూ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి కూడా ఇలా మతాన్ని వాడుకోలేదు. ఎప్పుడైనా గుడికి వెళ్లడంలో ఇబ్బంది లేదు. కానీ దానినే ప్రధాన అంశం చేస్తేనే సమస్య. 40శాతం మంది ప్రజలు భాజపాకు ఓటు వేశారంటే.. 60 శాతం మంది వేయలేదనే అర్థం. ప్రధాని అంటే దేశం మొత్తానికి.. కేవలం భాజపాకే కాదు. ప్రజలు అలాంటి సందేశాన్నే కోరుకుంటున్నారు. నిజమైన సమస్య ఏమిటో వారే నిర్ణయించుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. 

రామమందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ గైర్హాజరీపై ఆచార్య ప్రమోద్‌ కృష్ణం అసంతృప్తి వ్యక్తంచేశారు. అది హిందూ వ్యతిరేక నిర్ణయమని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈసందర్భంగా పలు విమర్శలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img