icon icon icon
icon icon icon

మొన్న పూరీ.. నేడు చండీగఢ్‌.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు

చివరి నిమిషంలో అభ్యర్థులు వీడుతుండటం ఆయా పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

Updated : 07 May 2024 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల వేళ.. పోలింగ్‌కు ముందే పలు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత కారణంగా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డబ్బులు లేవని, పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని పార్టీలను వీడుతున్నారు. మొన్న కాంగ్రెస్‌కు ఓ అభ్యర్థి ఇలాంటి షాకే ఇవ్వగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్‌ ఆ జాబితాలో చేరింది.

శిరోమణి అకాలీ దళ్‌ చండీగఢ్‌ లోక్‌సభ అభ్యర్థి హర్దీప్‌ సింగ్‌ సైనీ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని, నేతల నుంచి మద్దతు కొరవడిందని కారణాలు చెబుతూ ఆయన పార్టీని వీడారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒక్క రోజు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రచారం చేసుకోవడానికి తనకు పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదనీ.. పార్టీ పెద్దలు తనకు మద్దతుగా నియోజకవర్గానికి రావడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీ చండీగఢ్‌ యూనిట్‌కు అధ్యక్షుడైన సైనీ.. తన టికెట్‌ను ఇతరులకు ఇవ్వాలని కోరారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో చివరి దశలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

తొలిసారి పోటీ.. అంతలోనే..

ఇక సైనీ నిష్క్రమణతో ఈ నియోజకవర్గంలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టడం శిరోమణి పార్టీకి ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ భాజపా అభ్యర్థులకు ఆ పార్టీ మద్దత్తు ఇస్తూ వచ్చింది. రైతు చట్టాలపై విభేదాల కారణంగా 2021లో రెండు పార్టీల మధ్య బంధం తెగింది.

మొన్న పూరీలో..

ఒడిశాలోని పూరీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత మొహంతీ కూడా ఇటీవల ఇవే కారణాలు చెప్పి తన టికెట్‌ను వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా ఖర్చులను భరించే స్తోమత లేకపోవడంతో, పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు.

తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు..

చివరి నిమిషంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటుండంతో.. ఏం చేయాలో తెలియక ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకుని భాజపాలో చేరడంతో అక్కడ హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img