Published : 13/11/2021 09:26 IST

World Dictators: ఈ నియంతల ఆహారపు అలవాట్లు భలే విచిత్రం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాచరికాలు అంతమయ్యాక కొన్ని దేశాలు నియంతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వారి ఏకఛత్రాధిపత్యంలో ఏది చెబితే అదే శాసనమయ్యేది. వారి అధికార దర్పానికి ఎవరు అడ్డొచ్చినా వారి అంతుచూసేవారు. అహం.. అసూయలతో యుద్ధాలకు దిగేవారు. సామాన్య ప్రజల సంక్షేమం, భద్రత ఇలాంటివేవి వారికి పట్టేవి కాదు. కానీ, వారి వ్యక్తిగత విషయాలు, ఆహార అలవాట్ల విషయానికి వచ్చే సరికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. మరి చరిత్రలో కొందరు నియంతల ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో చూద్దామా..!

కిమ్‌ జోంగ్‌ ఇల్‌

ఉత్తర కొరియాలో పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు తరాలుగా కిమ్‌ కుటుంబం దేశాన్ని ఏలుతోంది. అందులో రెండో తరం వ్యక్తి, దేశ మాజీ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌కు షార్క్‌-ఫిన్‌(సొర చేపల రెక్కలు) సూప్‌, శునకం మాంసంతో చేసిన సూప్‌ అంటే చాలా ఇష్టపడేవారట. అవి అతడికి రోగనిరోధకశక్తి, బలాన్ని ఇస్తాయని నమ్మేవారు. అంతేకాదు.. ఆయన తినే ఆహారంలో ఉపయోగించే బియ్యం నాణ్యత, ఆకృతి, రంగును పరిశీలించడానికి పదుల సంఖ్యలో మహిళలతో ఒక బృందం ఉండేది. 


అడాల్ఫ్‌ హిట్లర్‌

1933 నుంచి 1945 మధ్య జర్మనీని పరిపాలించిన నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. ఆయన శాకాహారి కావడంతో ఎక్కువగా బంగాళదుంపల పులుసుతో భోజనం చేసేవారు. బంగాళదుంపల పులుసుతో తనకున్న దీర్ఘకాలిక అపానవాయువు, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయని నమ్మేవారు. హిట్లర్‌ తినడానికి ముందు ఆయనకు పెట్టిన ఆహారాన్ని పరిశీలించడానికి 15 మంది ఫుడ్‌ టెస్టర్లు ఉండేవారు. వారంతా ఆహారం తిని 45 నిమిషాల తర్వాత బతికి ఉంటే అప్పుడు హిట్లర్‌ భోజనం చేసేవారట. 


జోసెఫ్‌ స్టాలిన్‌

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌కు ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్‌. సోవియట్‌లో నియంతృత్వ పాలన సాగించారు. జార్జియాకు చెందిన స్టాలిన్‌ ఆ దేశ సంప్రదాయ వంటకాలంటే బాగా ఇష్టపడేవారు. వాల్‌నట్స్‌, రేగు పండ్లు, దానిమ్మ పండ్లను ఎక్కువగా తినేవారట. ఆయనకు ఆహారం వండిపెట్టే వ్యక్తి ఎవరో ఎవరో తెలుసా?ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాత స్పిరిడాన్‌ పుతిన్‌. స్టాలిన్‌ కన్నా ముందు సోవియట్‌ను పాలించిన వ్లాదిమిర్‌ లెనిన్‌కు కూడా ఆయన వంట చేసేవారు. స్టాలిన్‌ భోజనం చేసే సమయాన్ని ఎంతో ఇష్టంగా గడుపుతారు. ఆడుతూ.. పాడుతూ.. ఒక్కోసారి ఎనిమిది గంటలు భోజనం చేస్తారట.


బెనిటో ముస్సోలిని

పూర్తి పేరు బెనిటో అమిలికేర్‌ ఆండ్రియా ముస్సోలిని. ఇటలీ మాజీ ప్రధానమంత్రి. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి, నేషనల్‌ ఫాసిస్ట్‌ పార్టీని స్థాపించి.. 1922లో ఆ దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన నియంతృత్వ పాలనపై వ్యతిరేకత పెరిగింది. దీంతో ఆయన 1943లో గద్దె దిగాల్సి వచ్చింది. ఆయనకు వెల్లుల్లితో చేసిన సలాడ్‌ అంటే చాలా ఇష్టం. కేవలం వెల్లుల్లిని ముక్కలుగా చేసుకొని వాటిపై నూనె, నిమ్మరసం పోసుకొని తినేసేవారట. ఇక భోజనం విషయానికి వస్తే వీలైనంత వరకు తన కుటుంబంతో కలిసి తినడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన డైనింగ్‌ టేబుల్‌ వద్దకు వచ్చే సరికి కుటుంబసభ్యులు, వడ్డించే వ్యక్తులు సిద్ధంగా ఉండాలి. భోజనం విషయంలో ముస్సోలిని సమయపాలన, క్రమశిక్షణను కచ్చితంగా పాటించేవారని చరిత్రకారులు చెబుతున్నారు.


ఈదీ అమీన్‌ 

ఈదీ అమీన్.. ఉగాండా దేశాన్ని పరిపాలించిన సైనిక అధికారి. 1971 నుండి 1979 వరకు ఉగాండా దేశానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. ప్రపంచంలో అత్యంత కిరాతక నియంతల్లో ఒకడిగా పేరుంది. అనేక రాజకీయ పరిణామాల మధ్య అతడిని పదవిని నుంచి దించేయడంతో సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు. అయితే, సౌదీలో ఉన్ననాళ్లు అమీన్‌ రోజుకు 40 బత్తాయి పండ్లు, కేఎఫ్‌సీ చికెన్‌ బాగా తినేవారు. మధ్యాహ్నం సమయంలో టీ తాగడాన్ని ఇష్టపడతారట. అతను నరమాంసభక్షకుడనే వదంతులు కూడా ఉన్నాయి.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్