ఒబామాపై భారత్‌లో సివిల్ కేసు!

భారత్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సివిల్ కేసు నమోదైంది.

Published : 19 Nov 2020 15:38 IST

లఖ్‌నవూ: భారత్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సివిల్ కేసు నమోదైంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను అవమానించారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన జ్ఞాన్‌ ప్రకాశ్‌ శుక్లా ఈ కేసు వేశారు. ఆయన ఆల్‌ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు.  కాగా, ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పేరుతో ఒబామా రాసిన పుస్తకంలో రాహుల్, మన్మోహన్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ కాంగ్రెస్‌  అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ..లాల్‌గంజ్‌ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ పుస్తకానికి వ్యతిరేకంగా అభిమానులు వీధుల్లోకి వస్తే, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని..అందుకే ఒబామాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. కేసు నమోదు చేయకపోతే యూఎస్ ఎంబసీ ముందు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. 

తన కుమారుడు రాహుల్ గాంధీకి ఎటువంటి అడ్డంకి కలిగించరనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిగా చేశారని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే ఆ పదవిని కట్టబెట్టినందుకు మన్మోహన్ సింగ్ ఆమెకు రుణపడి ఉన్నారని తెలిపారు. మరోవైపు, రాహుల్‌ గురించి చెప్తూ..పని పూర్తి చేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని ఆరాటపడే విద్యార్థిలా ఉంటారే తప్ప ప్రావీణ్యం సంపాదించాలనే తపన కనిపించదని విమర్శనాత్మకంగా రాసుకొచ్చారు. కాగా, ఈ పుస్తకం 17న మార్కెట్లో విడుదలైంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని