ముంపులో 37,409 కుటుంబాలు:లోకేశ్‌ కుమార్‌

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

Published : 19 Oct 2020 02:24 IST

హైదరాబాద్: నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కమార్‌ తెలిపారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని.. వరద ప్రభావంతో 37,409 కుటుంబాలు ముంపు బారిన పడ్డారని చెప్పారు. గుర్రం చెరువుకు వరద వచ్చేందుకు అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల నుంచి 2,100 కుటుంబాలను నిన్న సాయంత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్న ప్రాంతాల్లో రూ. 2,800 విలువైన వస్తువులను అందిస్తున్నట్లు లోకేశ్‌ కుమార్‌ వివరించారు. ఇప్పటివరకు 20 వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్లు పంపిణీ చేశామన్నారు. మధ్యాహ్నం సమయంలో 90 వేలు, సాయంత్రం 60 వేల భోజనాలను అన్నపూర్ణ కేంద్రాలతో పాటు   వరద ప్రభావిత ప్రాంతాల్లో అందజేస్తున్నట్లు వివరించారు.

ఫిర్యాదులను పరిష్కారానికి రూ. 1.20 కోట్లు

నగరంలో కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నుంచి జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సీవరేజ్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు రూ. 1.20కోట్లు మంజూరు చేసినట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అత్యవసర పరిస్థితుల్లో సేవల కోసం అదనంగా 700 మంది సిబ్బంది నియమించినట్లు చెప్పారు. రిజర్వాయర్ల శుద్ధి, మరమ్మతులు చేసేందుకు అదనంగా మరో రూ.50లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస ప్రాంతాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్ ద్వారా తాగు నీటిని సరఫరా చేయాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని