కరోనా మృతులపై వాస్తవాలు చెప్పండి:హైకోర్టు

కరోనా నివారణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated : 04 Sep 2020 15:31 IST

తెలంగాణ ప్రభుత్వం నివేదికపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి

హైదరాబాద్‌: కరోనా నివారణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉంది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. 

మొబైల్‌ వ్యాన్ల ద్వారా పరీక్షలు నిర్వహించాలి

‘‘జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలి. జిల్లాస్థాయి బులెటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు జిల్లా బులెటిన్లు సమర్పించాలి. జీహెచ్‌ఎంసీలో ఐసోలేషన్‌, కొవిడ్‌ కేంద్రాల వివరాలు అందజేయాలి. జిల్లాల నుంచి కొవిడ్‌ బాధితులు హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్సులు పెంచాలి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసే ల్యాబ్‌ల సంఖ్య పెంచాలి. కరోనాకు ముందు.. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ వివరాలు సమర్పించాలి. వీధుల్లో నివసించేవారికి మొబైల్‌ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలి’’ అని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికి అతీతమా?

మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికి అతీతమా? అని ప్రశ్నించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రజలకు సేవచేసే బాధ్యత లేదా? అని ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్పత్రులపై విచారణ జరిపి ఈనెల 22లోపు నివేదిక అందజేయాలని జాతీయ ఫార్మా సంస్థను.. నివేదిక రాగానే బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పీహెచ్‌ డైరెక్టర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వు చేస్తామన్న మంత్రి హామీ ఎందుకు అమలుకాలేదని ప్రశ్నించింది. సగం పడకలు రిజర్వు చేస్తారా? లేదా? అనేది తెలపాలని..ఒకవేళ రిజర్వు చేయొద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలని సూచించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళికలను 22లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని