హైదరాబాద్‌లో ట్రాపిక్‌ ఆంక్షలు

మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు..

Updated : 01 Sep 2020 07:18 IST

నేడే మహా నిమజ్జనం

సాగర్‌కు తరలిరానున్న వినాయకుడి విగ్రహాలు

హైదరాబాద్‌: మహా నిమజ్జనానికి భాగ్య నగరం సిద్ధమైంది. వివిధ రూపాల్లో కొలువుదీరి, పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు కొద్ది గంటల్లో గంగ ఒడికి చేరనున్నారు. నలుమూలల నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి ప్రధాన మార్గంలో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై పోలీసులు 21 క్రేన్లను సిద్ధం చేశారు.

ఉదయం 10.30కు ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు

ఖైరతాబాద్‌: హైదరాబాద్‌ మహా నిమజ్జనమనగానే ఖైరతాబాద్‌ భారీ గణేషుడే గుర్తుకొస్తాడు. ఈసారి ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని అదనపు సీపీ(ట్రాఫిక్‌) ఎస్‌.అనిల్‌ కుమార్‌ తెలిపారు. నిమజ్జన ప్రక్రియ పూర్తికాకపోతే ఆంక్షలను పొడిగించనున్నామని వివరించారు.

* ప్రధాన రహదారులపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.

* నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.

* విమానాశ్రయానికి వెళ్లేవారు.. వచ్చేవారు.. బాహ్యవలయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించడం శ్రేయస్కరం. ఇమ్లీబన్‌, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని మార్గాలను ఎంచుకోవాలి.

ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626

ప్రజలు సహకరించాలి

నారాయణగూడ, కవాడిగూడ, న్యూస్‌టుడే: గణేష్‌ శోభాయాత్ర శాంతియుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు తమకు పూర్తి సహకారం అందించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. అడుగడుగునా గట్టి నిఘా, పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగర పోలీసు అధికారులతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల్లో సుమారు 30,000 ప్రతిమలు నిమజ్జనం అయ్యాయన్నారు. తొమ్మిది అడుగుల లోపు ఉన్నవి సుమారు 4,000 విగ్రహాలు నేడు ట్యాంక్‌బండ్‌ వస్తాయని భావిస్తున్నామన్నారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

వాహనాల మళ్లింపు

- సీపీ మహేష్‌ భగవత్‌

నేరేడ్‌మెట్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చెరువుల వద్ద మంగళవారం నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ఏరాట్లు చేసినట్లు సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు వాహనాలు దారి మళ్లిస్తున్నామన్నారు. విగ్రహాలు నిర్దేశిత మార్గాల్లో చెరువుల వద్దకు చేరుకోవాలని కోరారు.

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపుతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 18 కి.మీ. కొనసాగే యాత్ర మార్గాన్ని నిరంతరం పరిశీలించేందుకు వీలుగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదనంగా ప్రతి పోలీస్‌ ఠాణా పరిధిలోని ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ‘‘నేను సైతం’’ పేరుతో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను అనుసంధానించారు. భారీ విగ్రహాలు లేకపోవడంతో ఈసారి నిమజ్జన ఘట్టం వేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని