Telangana News: కామారెడ్డిలో మంకీపాక్స్‌ కలకలం.. బాధితుడు హైదరాబాద్‌కు తరలింపు

దేశ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డిలో ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది.

Published : 25 Jul 2022 02:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మంకీపాక్స్‌ లక్షణాలున్న వ్యక్తిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన 40ఏళ్ల  వ్యక్తికి మంకీ పాక్స్‌ లక్షణాలున్నట్టు బయటపడింది. ఈనెల 6న అతను కువైట్‌ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23వ తేదీ నాటికి ఒళ్లంతా రాషెస్‌ రావడంతో మరుసటిరోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్‌ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని నుంచి నమూనాలు సేకరించి పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అప్పటి వరకు ఫీవర్‌ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. అతనితో కాంటాక్ట్‌ అయిన ఆరుగురిని గుర్తించి వారిని కూడా ఐసోలేషన్‌ చేసినట్టు చెప్పారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఆయన సూచనల మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని