CM Jagan: వైఎస్‌ఆర్‌, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులు: సీఎం జగన్‌

విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్‌ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని..

Updated : 10 Mar 2022 13:53 IST

అమరావతి: విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్‌ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని.. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కొద్దిరోజుల క్రితం మృతి చెందిన మాజీ సీఎం రోశయ్య సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. మాజీ సభ్యుల మృతిపై సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని.. వాళ్ల మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. వైఎస్‌, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. అలాంటి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమని.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్‌ చెప్పారు.

ఇటీవల మృతిచెందిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతున్నట్లు సీఎం చెప్పారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్‌ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్‌ అనసూయమ్మ, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచనతో శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని