Star Cineplex: లుంగీలో వచ్చాడని సినిమా టికెట్‌ నిరాకరణ.. ఆపై ఏం జరిగిందంటే!

లుంగీ కట్టుకుని సినిమా చూసేందుకు వచ్చిన తనకు టికెట్‌ నిరాకరించారని ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు బంగ్లాదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...

Published : 06 Aug 2022 01:31 IST

ఢాకా: లుంగీ కట్టుకుని సినిమా చూసేందుకు వచ్చిన తనకు టికెట్‌ నిరాకరించారని ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు బంగ్లాదేశ్‌లో చర్చకు దారితీశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు సంఘీభావంగా పలువురు లుంగీలు కట్టుకుని థియేటర్‌కు వెళ్లి ఆందోళన తెలిపారు. దీంతో సంబంధిత థియేటర్‌ యాజమాన్యం దిగొచ్చింది. జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ.. సదరు వ్యక్తికి కుటుంబంతో సహా అదే థియేటర్‌లో సినిమా చూసేందుకు అవకాశం కల్పించింది.

బంగ్లాదేశ్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ‘స్టార్ సినీప్లెక్స్’లో సినిమా చూసేందుకు సమన్‌ అలీ సర్కార్‌ అనే వ్యక్తి బుధవారం లుంగీ ధరించి వచ్చారు. అయితే, ఈ కారణంతోనే తనకు టికెట్‌ నిరాకరించినట్లు ఆయన ఆరోపించారు. ‘ఢాకాలోని స్టార్ సినీప్లెక్స్ థియేటర్‌లో ‘పోరన్’ సినిమా చూసేందుకు వెళ్లా. అయితే, లుంగీ ధరించానన్న కారణంతో టికెట్ నిరాకరించారు’ అని ఆయన వ్యాఖ్యానించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సంస్థ తాజాగా వివరణ ఇచ్చింది. వస్త్రధారణ ఆధారంగా వినియోగదారుల పట్ల తాము ఎలాంటి వివక్ష చూపడం లేదని తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది.

సంబంధిత వ్యక్తి అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని.. జరిగిన దానికి చింతిస్తున్నామని పేర్కొంది. అనంతరం థియేటర్‌ యాజమాన్యం.. సర్కార్‌తోపాటు ఆయన కుటుంబాన్ని అదే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి ఆహ్వానించింది. సంబంధిత ఫొటోలను పంచుకుంది. ‘పోరన్’ నటుల్లో ఒకరైన సరిఫుల్ రాజ్ కూడా వారితో కలిసి సినిమా చూడటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని