Andhra News: మినిట్స్‌ వివరాలు ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమం: బొప్పరాజు

మంత్రుల కమిటీ, సీఎస్‌తో జరిగిన చర్చల మినిట్స్‌ కాపీ బుధవారం సాయంత్రంలోగా ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మినిట్స్‌ కాపీ ఇస్తేనే రేపటి నల్ల రిబ్బన్ల నిరసన విరమిస్తామని చెప్పారు.

Updated : 08 Mar 2023 17:40 IST

అమరావతి: ప్రభుత్వ హామీలన్నీ లిఖిత పూర్వకంగా ఇస్తే ఉద్యమ కొనసాగింపుపై పునరాలోచన చేస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అది కూడా బుధవారం సాయంత్రంలోగా  మినిట్స్‌ కాపీలు ఇస్తే రేపటి నల్ల రిబ్బన్ల నిరసన విరమిస్తామన్నారు. లేదంటే యథావిధిగా నిరసన కొనసాగుతుందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి స్పష్టంగా చెప్పినట్లు బొప్పరాజు వెల్లడించారు. 

బొప్పరాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మిగిలిన పీఆర్సీ బకాయిలు, కొత్త డీఏలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సిన తరుణంలో మళ్లీ సీఎస్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న జరిగే సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. వాటన్నింటినీ లిఖితపూర్వకంగా మినిట్స్‌ రూపంలో ఇవ్వాలని మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ, సీఎస్‌కు తెలియజేశాం. ఒకవేళ బుధవారం సాయంత్రంలోపు మినిట్స్‌ ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం’’ అని వెల్లడించారు. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న బొప్పరాజు.. తమ అజెండా నుంచి పక్కకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని