Botsa Satyanarayana: సాంకేతిక కారణాలతోనే టీచర్ల వేతనాలు ఆలస్యం: బొత్స

విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ మాట్లాడిన మంత్రి బొత్స.. టీచర్ల వేతనాలు ఆలస్యం అవడంపై క్లారిటీ ఇచ్చారు.

Published : 05 Sep 2023 15:06 IST

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని.. 7 లేదా 8వ తేదీల్లో టీచర్ల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి పురస్కారాలు అందించారు. ఆయనతోపాటు మంత్రి గడివాడ అమర్‌నాథ్‌, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు.

మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవు. దీనిపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం నియామకాలపై సీఎం జగన్‌ దృష్టి పెట్టారు. 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. నెల రోజుల్లో అన్ని వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ చేపడతాం. ప్రభుత్వ పాఠశాల ముందు నో సీట్ బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోంది. ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను ప్రశంసించారు’’ అని బొత్స వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని