Avinash Reddy: కర్నూలులో టెన్షన్.. టెన్షన్‌.. విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు!

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు వచ్చారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో అప్పటినుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. మరోవైపు ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. 

Updated : 22 May 2023 11:37 IST

కర్నూలు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు వచ్చారు. ఇటీవల అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని ఆమెను విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా అవినాష్‌ రెడ్డి అక్కడే ఉంటున్నారు.

ఈ నెల 22న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు పంపగా, తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే ఆసుపత్రికి చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక ఆసుప్రతి లోపల, పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విశ్వభారతి ఆసుపత్రి మార్గంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆసుపత్రి పరిసరాల్లో దుకాణాలను తెరవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు వైకాపా కార్యకర్తలు అవినాష్‌రెడ్డి ఉంటున్న ప్రాంతానికి భారీగా తరలివస్తున్నారు.

అవినాష్‌ను లొంగిపోమనండి..

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్న సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీతో చర్చిస్తున్నారు. లొంగిపోవాలని ఎంపీ అవినాష్‌కు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఎస్పీతో వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారుల విజ్ఞప్తిపై ఎస్పీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఆదివారం రాత్రి కర్నూలు నగరంలో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. విశ్వభారతి ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. వారిని నానా దుర్భాషలాడారు. రాత్రి వేళ మీకు ఇక్కడేం పని అంటూ దాడి చేశారు. కొందరు మీడియా ప్రతినిధుల చేతుల్లోని కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. అసలు ఆ వీధిలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు