Health tips: పెరుగు, మజ్జిగలతో వేసవి తాపానికి చెక్‌..!

ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి చల్లని మజ్జిగను ఇవ్వడం మన తెలుగు వారి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి...........

Updated : 13 Sep 2022 10:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎండన పడి ఇంటికి వచ్చిన వారికి చల్లని మజ్జిగను ఇవ్వడం మన తెలుగు వారి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఎండల దాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది. వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా నిరసంతో ఉంటుంది. వేడి, ఉక్కపోతల కారణంగా మనుషులు తోటకూర కాడల్లా వాడిపోతుంటారు. ఇలాంటప్పుడు పెరుగుతో చేసిన పదార్థాలను, లస్సీ, మజ్జిగలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి తాగడం వల్లన పోయిన ప్రాణం లేచొచ్చిన్నట్లు అనిపిస్తోంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే పెరుగు, మజ్జిగల గురించి తెలుసుకుందాం..!

మజ్జిగ తాగడం వల్ల ప్రయోజనాలు:

ఎండలు మండిపోయే వేసవిలో మనకు పెరుగు, మజ్జిగలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వేసవిలో మజ్జిగ తాగడానికి అందరూ ఇష్టపడతారు. మండే ఎండలో వచ్చే వ్యక్తికి మజ్జిగ ఇవ్వడం వల్ల దప్పిక తీరడంతో పాటు మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. మజ్జిగలో మన పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్‌ వంటి ఉపయుక్తమైన బాక్టిరియా ఎక్కువగా ఉంటుంది. మజ్జిక తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. మజ్జిగలోని ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఉప్పు లేదా పంచదారను కలిపి తీసుకోవచ్చు. మజ్జిగలో సన్నగా తరిగిన మిర్చి, కొన్ని కీరా ముక్కలు, కొంచెం కొత్తిమీరా వేస్తే రుచి బాగుంటుంది. మనకు ఇంత మేలు చేసే పెరుగు, మజ్జిగను రోజువారీ ఆహారంలో తీసుకుంటారు కదూ.

జామ చేసే మేలు

పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకాయలు విటమిన్‌ సి,ఎలు సమృద్ధిగా అందించే ఖజానాగా చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జామకాయను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తలనొప్పి, మైగ్రెన్‌తో బాధపడుతున్నవారు దోరజామ పండును సానరాయి గంధంగా తీసి నుదిటి మీద లేపనంగా పూస్తే ఉపశమనం దొరుకుతుంది. జామపండ్లను చిన్న సైజు ముక్కలుగా కోసి తాగే నీటిలో మూడు గంటల పాటు నానాబెడితే ఆ నీళ్లు తాగడం వల్ల అధిక దప్పిక తీరుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అతిసార, గర్భిణుల్లో ఉండే వాంతుల సమస్యలు, జిగట విరేచనాలు, గ్యాస్టిక్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జామకాయలో అధికంగా పీచు పదార్థం ఉండటంతో జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి పేగుల కదలికను సక్రమంగా చేస్తుంది. జామకాయ కషాయాన్ని మజ్జిగలో కలిపి కషాయాన్ని తాగితే వాంతులు నుంచి బయట పడొచ్చు. ప్రతిరోజు ఒక జామకాయను తింటే కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధుల్ని కూడా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు బలంగా ఉంటాయి. ఇందులో విటమిన్‌ సి ఉండటంతో పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. బాగా పండిన జామకాయ గుజ్జులో నుంచి గింజలు తొలగించి పాలు, తేనే కలిపి తీసుకుంటే విటమిన్‌ సీ, కాల్షియం మెండుగా లభిస్తుంది. క్షయ, హైపటైటిస్‌, ఉబ్బసం, గుండె బలహీనత, మూత్రంలో మంటగా ఉండటం, కామెర్లు, జీర్ణాశయ అలసర్లు వంటి సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్‌ ఎ ఉన్న జామకాయను తినడం వల్ల కంటి సమస్యలను అధిగమించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని