CII: ఆ ప్రతిపాదనను తెలంగాణ సర్కార్‌ ఉపసంహరించుకోవాలి: కేటీఆర్‌కు సీఐఐ లేఖ

నెలకు ఒక్కో మెగావాట్‌కు రూ.2,37,500 గ్రిడ్‌ మద్దతు ఛార్జీలను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని.. దీని వల్ల పరిశ్రమలు నష్టపోయే అవకాశాలున్నాయని

Published : 13 Mar 2022 01:35 IST

హైదరాబాద్‌: నెలకు ఒక్కో మెగావాట్‌కు రూ.2,37,500 గ్రిడ్‌ మద్దతు ఛార్జీలను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని.. దీని వల్ల పరిశ్రమలు నష్టపోయే అవకాశాలున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈనెల 2న రాసిన లేఖలో సీఐఐ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబంధించి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకునే ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ లాంటి చోట్ల ఎక్కడా ఈ తరహా ఛార్జీలు లేవన్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో గ్రిడ్‌ సపోర్ట్‌ ఛార్జీలు మెగావాట్‌కు రూ.20వేల నుంచి రూ.30వేల లోపే ఉన్నాయని వెల్లడించారు.

‘‘తెలంగాణ ప్రభుత్వం విధించాలనుకున్న గ్రిడ్‌ సపోర్ట్‌ ఛార్జీల కారణంగా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. దానివల్ల పరిశ్రమల మధ్య పోటీతత్త్వంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సైతం ఇది విఘాతంగా మారుతుంది. రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏప్రిల్‌ 1 నుంచి గ్రిడ్‌ మద్దతు ఛార్జీలను క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల సిమెంట్‌, పేపర్‌, మెటలర్జికల్‌ సంబంధిత కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఇతర క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్స్‌పై ప్రభావం పడుతుంది. క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్స్‌పై గ్రిడ్‌ మద్దతు ఛార్జీలను వేయాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి’’ అని సీఐఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని