Mallu Swarajyam: తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ.. మల్లు స్వరాజ్యం: సీఎం కేసీఆర్‌

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సాయుధ...

Published : 20 Mar 2022 01:46 IST

హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటానికి తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ.. స్వరాజ్యం అని కొనియాడారు. మల్లు స్వరాజ్యం అహర్నిశలు ప్రజల కోసం కృషి చేశారన్నారు. గొప్ప మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆమె గమనం, గమ్యం రేపటి తరానికి స్ఫూర్తి అని తెలిపారు. మల్లు స్వరాజ్యం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


‘‘తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం అనుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా వారు అందించిన సేవలు మరువలేనివి’’

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


‘‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం గారి మృతి బాధాకరం. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మల్లు స్వరాజ్యం గారి  ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’

- మంత్రి హరీశ్‌రావు


‘‘అణగారిన వర్గాలను చైతన్యపరిచి…
నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడి…
ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి…
నిష్క్రమించిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి మరణం తీరని లోటు…
వారితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లాల్ సలాం...’’

- రేవంత్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్‌


‘‘నిజాం వ్యతిరేక పోరాటంలో ముఖ్య భూమిక పోషించి, తుపాకీ పట్టిన వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె మరణం వామపక్షాలకు, రాష్ట్రానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ 

- చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి


‘‘మల్లు స్వరాజ్యం మృతి తీవ్రమైన బాధను కలిగించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమెది కీలక పాత్ర. శాసనసభ్యురాలిగా రైతులు, శ్రామికులు, పేద ప్రజల తరఫున వాణి వినిపించారు. వేలాది మంది మహిళలకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆమె స్ఫూర్తి. చివరిదాకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె ఒక అరుదైన పోరాట యోధురాలు’’ 

- సురవరం సుధాకర రెడ్డి


‘‘మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. తుపాకీ పట్టుకుని ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత. పేదల పక్షాన ఆమె చేసిన పోరాటాలు చిరస్మరణీయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధ ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాత్ర మరువలేనిది. మహిళల సమస్యలపైన తుదిశ్వాస వరకు గళమెత్తిన గొప్ప నాయకురాలు. మల్లు స్వరాజ్యం లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’

- బండి సంజయ్‌


‘‘చివరివరకు నమ్మిన సిద్ధాంతం కొసం పని చేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు’’

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 


‘‘మల్లు స్వరాజ్యం పేరు వింటే సాయుధ పోరాటం గుర్తుకువస్తుంది. సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరవనిత స్వరాజ్యం. కమ్యూనిస్టు ఉద్యమానికి, సీపీఎంకు ఆమె మరణం తీరని లోటు’’

- తమ్మినేని వీరభద్రం


‘‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణ వార్త చాలా ఆవేదన కలిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి స్వరాజ్యం తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ అజరామరం. స్వరాజ్యం పేరులోనే ఒక స్ఫూర్తి నిండి ఉంటుంది. ఆమె మరణం ప్రజాస్వామ్యవాదులు, పీడిత వర్గాలకు తీరని లోటు. వీరనారికి నివాళులు అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.’’

- పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని