అరుదుగానే కొవిడ్‌ రీ-ఇన్ఫెక్షన్‌..కానీ..,

ఓసారి కరోనా వైరస్‌ సోకినవారికి మళ్లీ (రీ-ఇన్‌ఫెక్షన్‌) సోకే ప్రమాదం లేకపోలేదని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Updated : 19 Mar 2021 04:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాది గడిచినా ప్రపంచాన్ని కొవిడ్‌ మహమ్మారి వీడడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో రెండో దఫా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓసారి కరోనా వైరస్‌ సోకినవారికి మళ్లీ (రీ-ఇన్‌ఫెక్షన్‌) సోకే ప్రమాదం లేకపోలేదని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, కొవిడ్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌ అరుదుగా సంభవిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ, వృద్ధులు మాత్రం రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ నివేదిక స్పష్టంచేసింది.

సాధారణంగా కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది నెలలవరకు యాంటీబాడీల నుంచి రక్షణ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి వైరస్‌ బారినపడిన వారు కొవిడ్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌కు ఏ మేరకు గురవుతారనే విషయాన్ని తెలుసుకునేందుకు డెన్మార్క్‌లో భారీ పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 40లక్షల మంది పీసీఆర్‌ పరీక్షల సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో కేవలం అత్యల్పంగా 0.6శాతం మందిలో మాత్రమే రెండోసారి వైరస్‌ సోకినట్లు తేలింది. ముఖ్యంగా 65ఏళ్లకు తక్కువ వయసున్న వారిలో రీ-ఇన్‌ఫెక్షన్‌ నుంచి 80శాతం రక్షణ కల్పిస్తున్నట్లు గుర్తించారు. ఇక 65ఏళ్లకు పైబడిన వారిలో కేవలం 47శాతం మాత్రమే రీ-ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ పొందుతున్నట్లు గ్రహించారు. తద్వారా మరోసారి కొవిడ్‌ బారిన పడే ప్రమాదం 65ఏళ్ల వయసుపైబడిన వారిలో ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వల్ల తెలుస్తోందన్నారు.

‘యువకులు, ఆరోగ్యవంతుల్లో కొవిడ్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌ తక్కువే. కానీ, వృద్ధుల్లో మాత్రం ఈ ముప్పు ఎక్కువే. అందుకే వృద్ధులను కొవిడ్‌ బారినపడకుండా చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డెన్మార్క్‌లోని స్టేటెన్స్‌ సీరం ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ స్టీన్‌ ఈతెల్‌బర్గ్‌ పేర్నొన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు ఎంత అవసరమో తాజా అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న అనంతరం శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయో తెలియవని, అందువల్ల వైరస్‌ సోకినవారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని