Dark circles: కంటి కింద నల్లటి వలయాలా... ఇలా చేయండి!

లేట్‌ నైట్ నిద్రపోవడమో, కళ్లజోడు ధరించడమో కారణం ఏదైనా కావచ్చు. కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు పెద్ద సమస్యగా మారుతోంది. 

Published : 09 May 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లేట్‌ నైట్ నిద్రపోవడమో, కళ్లజోడు ధరించడమో, ఎక్కువసేపు స్క్రీన్‌(టీవీ, లాప్‌టాప్‌, ఫోన్‌) చూడటమో కారణం ఏదైనా కావచ్చు. వీటి వల్ల కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. దీంతో ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలి. మందులున్నాయా! ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలా! అనుకుంటున్నారా! అవేమీ అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న వాటితో వీటిని తొలిగించుకోవచ్చు.

కోల్డ్‌ కంప్రెస్‌

చల్లని నీటితో తడిపిన బట్టను కళ్ల కింది భాగంలో ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు పెట్టుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ కోల్డ్‌ కంప్రెస్‌ మాస్క్‌లు మీకు అందుబాటులో లేకుంటే గ్రీన్‌ టీ బ్యాగ్‌లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.


కీరదోస ముక్కలు

కీరదోసకాయ ముక్కలు కళ్లకు మంచి నేస్తాలు. తాజాగా ఉండే దోసకాయను తీసుకొని గుండ్రని ముక్కలుగా కట్‌ చేసుకోండి. వీటిని కళ్ల మీద ఉంచుకోండి. పది నిమిషాల తరవాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.     

మంచి నిద్ర

సమయానికి నిద్రపోయి వేకువనే మేల్కోవాలని పెద్దలు చెబుతుంటారు. నిజమేనండీ సమయానికి నిద్ర పోకపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కంటి కింద నల్లని వలయాలు రావడం కూడా ఒకటి. అందుకే 8 నుంచి 9 గంటలు నిద్ర పోవాలి.

రాత్రి పడుకునే ముందు ఫోన్‌ వద్దు

ప్రస్తుతం చాలా మంది ఫోన్లతోనే కాలయాపన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్‌ ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. లేట్‌ నైట్‌లో ఫోన్‌ వాడటం వల్ల ఫోన్‌ నుంచి వచ్చే కాంతి కళ్లను దెబ్బతీస్తుంది. కంటి సమస్యలు తలెత్తుతాయి. కంటి కింద నల్లని వలయాలు రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఇది ఒకటి. అందుకే రాత్రి సమయంలో ఫోన్‌ ఎక్కువగా వాడకూడదు.

చల్లని పాలు

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అంతేకాదు చల్లని పాలలో మేకప్‌ రిమూవర్‌ వైప్లను కాసేపు నానబెట్టండి. వీటిని రోజు కళ్లమీద 10 నిమిషాల పాటు పెట్టుకోండి. తరవాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

యాంటీ ఆక్సీడెంట్లు ఉండే ఆహారం తీసుకోండి

యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువగా  ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  బ్లాక్‌ బెర్రీ, డార్క్‌ చాక్లెట్‌ వంటి వాటిని తీసుకుంటే ఈ నల్లని వలయాలు తగ్గిపోతాయి. 

బాదం, ఆలివ్‌ ఆయిల్‌ ఎంతో మేలు 

బాదం, ఆలివ్‌ నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ నూనెను కళ్లకింద వలయాలున్న చోట మసాజ్‌ చేయాలి. ఇలా తరచూ చేస్తున్నట్లైతే క్రమంగా వలయాలు తగ్గిపోతాయి. ఈ నూనెను ముఖానికి రెండు నిమిషాల పాటు రాసుకొని తర్వాత స్నానం చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు