logo

జనం ఆస్తులు.. జగన్‌ గుప్పిట్లోకి!!

సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మేస్తే... ఇదెక్కడి చోద్యమనుకున్నారు పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం చిత్రం ముద్రిస్తే... తిట్టుకుంటూనే తీసుకున్నారు! రీ సర్వే చేసి కొలతలు వేస్తే... అన్నీ తప్పులేనని తల బాదుకున్నారు! ఇవన్నీ..

Updated : 05 May 2024 09:38 IST

కబళించే భూతం... ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’
ప్రజల ఆస్తులకు భద్రత లేనట్టే
హక్కు పత్రాలున్నా.. చెత్తకాగితాలే
అంతా అధికారుల చేతుల్లోనే
అంతటా... ఆందోళన రేపుతున్న వైకాపా కుట్ర

సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మేస్తే... ఇదెక్కడి చోద్యమనుకున్నారు పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం చిత్రం ముద్రిస్తే... తిట్టుకుంటూనే తీసుకున్నారు! రీ సర్వే చేసి కొలతలు వేస్తే... అన్నీ తప్పులేనని తల బాదుకున్నారు! ఇవన్నీ.. చిన్నచిన్న విషయాలే! అసలు కథ వేరే! వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును పరిశీలిస్తే జనం భూములన్నీ జగన్‌ జేబులోకెళ్లినట్లే! ఎవరూ హక్కుదారులు కాదు... ప్రభుత్వం చెప్పినవారే యజమాని!! ఇంత భయానక చట్టాన్ని అమలు చేసేందుకు కుట్ర పన్నిన జగన్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధమయ్యారు!!

విశాఖలో విలువైన భూములకు ఇప్పటికే రక్షణ లేదు. తప్పుుడు పత్రాలు సృష్టించి ఆస్తులు కొట్టేశారు. బెదిరింపులకు దిగి కబ్జాలకు పాల్పడ్డారు. వివాదాస్పద భూములను తెరమీదికి తెచ్చి కాజేశారు. అన్నదమ్ముల మధ్య విభేదాలను ఆసరాగా చేసుకొని లాగేశారు. చివరికి కుటుంబ తగాదాల్లోనివీ వదల్లేదు. వృద్ధులు, ఒంటరి మహిళలను రౌడీలతో బెదిరించి ఆస్తులు దోచేశారు. బీచ్‌ రోడ్డులోని ఆస్తులను ఆక్రమించేశారు. ప్రభుత్వం భూములు లాగేస్తుందని మభ్యపెట్టి డీపట్టాదారులను మోసం చేశారు.  ఇలా విశాఖలో రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాలు వైకాపా పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. ఇదంతా  కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు(భూ యాజమాన్యహక్కు చట్టం)కు ముందే జరిగింది. ఇక..ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని ఆస్తులు దోచేస్తారోనని జనం వణికిపోతున్నారు. ఇందులో మొదట బలయ్యేది బడుగు, బలహీన వర్గాలు, చిన్న,సన్నకారు రైతులు, అమాయక ప్రజలే. వారికి తెలియకుండానే ఇతరుల పేరున రాత్రికి రాత్రే రికార్డులు మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఎంతవరకు భద్రమనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ చట్టం ద్వారా వైకాపా అక్రమార్కులు ఆక్రమణలను అధికారికం చేసేసుకుంటారు. అదే కొనసాగితే జిల్లాలోని సామాన్యుల పరిస్థితి ఏంటి? వ్యూహాత్మకంగానే వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ చట్టం తీసుకొచ్చిందనే విమర్శలొస్తున్నాయి.

ఇప్పటికే వందల ఎకరాలు: వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో విశాఖ దారుణ విధ్వంసానికి గురైంది. పాలన చేపట్టగానే ఆ పార్టీ నేతలు విశాఖ మీద వాలారు. విలువైన భూములన్నింటిపై ముందే కన్నేసి వ్యూహాత్మకంగా దక్కించుకున్నారు. భీమిలి-భోగాపురం రహదారికి ఇరువైపులా ఉన్న భూములను బెదిరించి మరీ లాగేశారు. ఇలా రూ.వందల కోట్ల విలువైన స్థలాలు వారి పేరున మారిపోయాయి.  మరో వైపు భూసమీకరణ పేరుతో దారుణాలకు ఒడిగట్టారు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి తక్కువకే  కొనుగోలు చేసి భారీ లబ్ధి పొందారు. ఇలా వందల ఎకరాలు పెద్దల చేతుల్లోకి వచ్చాయి. ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల ఆస్తులు దోచేశారని ప్రతిపక్షాలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఈ తీరును పరిశీలిస్తే...ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా ఇక సాధారణ ప్రజల ఆస్తులు గాల్లో దీపమే అనుకోవాలి.

తరాలదైనా..ఆస్తి పత్రాలున్నా..

కొత్త చట్టం ప్రకారం.. ఒక వ్యక్తికి తరతరాలుగా వచ్చిన ఆస్తుల పత్రాలు, ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఉన్నా ఉపయోగం లేదు. టైటిల్‌ రిజిస్టర్‌లో ఆ భూమి ఉన్నట్లు టీఆర్‌వో(టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌) ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఆ ఆస్తికి విలువ. లేకుంటే ఆ పత్రాలన్నీ చిత్తుకాగితాలతో సమానం. ఈ చట్టం ప్రకారం ప్రజల స్థిరాస్తుల చట్టబద్ధ హక్కులపై నిర్ణయాధికారం టీఆర్‌వోలదే. పైకి కనిపించేది అధికారులే అయినా వాస్తవంగా రాజకీయ నేతలే వారిని నియమిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మన ఆస్తులు మనకు కాకుండా పోతాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రతిపక్షాలు అప్రమత్తం చేస్తున్నాయి.

కోర్టుకెళ్లినా ఉపయోగం లేదు

ఇప్పటికే ఫోర్జరీ, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.వందల కోట్ల ఆస్తులు కొట్టేశారు. వైకాపా వచ్చిన మొదటి రెండేళ్లలోనే విశాఖలో 200 వరకు నకిలీ డాక్యుమెంట్లపై అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కొత్త చట్టంలో పర్యవసనాలు ఇంకెంత దారుణంగా ఉంటాయో అంతుపట్టడం లేదు. ఇందులో నిర్ణయాధికారం అధికారులదే. వారిపై రాజకీయ ప్రభావం అధికంగా ఉంటుంది. వారికి సిఫార్సులు చేసిన వారికే హక్కులు అప్పగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో వందల మంది రైతులు వైకాపా పెద్దల చేతుల్లో  దారుణంగా మోసపోయారు.

  • ఇప్పటివరకు మన ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే న్యాయస్థానం ద్వారా పోరాడే వెసులుబాటు ఉంది. కింది కోర్టుల నుంచి పైకోర్టుల వరకు ఆశ్రయించొచ్చు. కొత్త చట్టం ప్రకారం అలా చెల్లదు. టీఆర్‌వో దగ్గర న్యాయం జరగకపోతే నేరుగా హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. అక్కడా కేవలం పునఃపరిశీలనకే అవకాశం ఉంటుంది. ఇదంతా తీవ్ర వ్యయప్రయాసాలకు దారి తీస్తుంది. పేదలకు భరించలేనంతగా మారుతుంది.

ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు..:  భూయాజమాన్య హక్కు చట్టం(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు ఉన్న ఆస్తి హక్కును హరించడానికి వైకాపా ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రాథమిక న్యాయస్థానాలను సైతం ఆశ్రయించకుండా చేసి ఆస్తులను దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చట్టం ఇది. దీనివల్ల ముఖ్యంగా రైతులు దోపిడీకి గురవుతారు. సమాజంలో విధ్వేషాలను రగిల్చే ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు.

దంత నరేష్‌కుమార్‌, విశాఖ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి

మానవ హక్కుల ఉల్లంఘనే..: బ్రిటిషు పాలకులు కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకురాలేదు. వైకాపా ప్రభుత్వం ఒక పద్ధతిలో ప్రజల ఆస్తులను లాగేసుకోవడానికి కుట్ర పన్నింది. ప్రజలు న్యాయబద్ధంగా ఆస్తులను వృద్ధి చేసుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. ఈ చట్టంలోని పలు అంశాలు మానవ హక్కుల ఉల్లంఘన దిశగా ఉన్నాయి. దీన్ని రద్దు చేయకపోతే ఉన్నత న్యాయస్థానంలో పోరాడతాం.

కె.మాధవీలత, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ ఫోరం ప్రధాన కార్యదర్శి

రెండేళ్లు దాటితే..: కొత్త చట్టంలో మన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం అతి సులభం. అది మనకు తెలియకుండానే జరగడానికి వంద శాతం ఆస్కారం ఉంది. ఆ భూమి ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే రెండేళ్ల వరకూ మనం స్పందించకుంటే ఆ ఆస్తిని దరఖాస్తు చేసిన వ్యక్తి పేరు మీద మార్చేస్తారు. అసలు వివాదం ఉందని తెలిస్తే కదా స్పందించేది. దీంతో వివాదం సృష్టించిన వ్యక్తే ఆ ఆస్తికి యజమానైపోతారు.

  • వైకాపా నేతలు కన్నేసిన ఆస్తులను ఈవిధంగా కొల్లగొట్టేస్తారు. కొందరు కావాలనే కక్షపూరితంగా వ్యవహరించి పేదలను ఇరికిస్తారు. విశాఖ వంటి చోట ఇటువంటి భూచోళ్లు అధికం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని