Andhra News: ప్రభుత్వ భూమికి కంచె.. గీతం కాలేజ్‌ పరిసరాల్లోని ఉత్కంఠ

విశాఖలోని గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచే దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది.

Updated : 06 Jan 2023 11:40 IST

విశాఖపట్నం: విశాఖలోని గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచే దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. వైద్యకళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారమూ జరిగింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టడం.. మరోవైపు తెదేపాకు చెందిన ముఖ్యనేతలను గృహనిర్బంధం చేయడంతో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేస్తున్నట్లు భీమిలి ఆర్డీవో పేర్కొనడంతో ఉత్కంఠకు తెరపడింది. 

తెల్లవారుజామునే రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది గీతం వైద్యకళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. కంచె ఏర్పాటుకు అవసరమైన సామగ్రితో అక్కడికి చేరుకుని పనులు మొదలుపెట్టారు. భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, డీఆర్వో పర్యవేక్షణలో సుమారు 3 గంటలపాటు పనులు కొనసాగాయి. పలుచోట్ల ‘ప్రభుత్వ భూమి’ బోర్డులు ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు నేపథ్యంలో గీతం వైద్య కళాశాల పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వెళ్లే వారిని తనిఖీలు చేశారు. మీడియాతో పాటు ఎవర్నీ కళాశాల లోపలికి అనుమతించకుండా కంచె ఏర్పాటు పనులు పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

గతంలోనే మార్క్‌ చేశాం: ఆర్డీవో

కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పుడు కంచె మాత్రమే ఏర్పాటు చేశామని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్‌ 37, 38లోని స్థలాన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్‌ చేశామని.. ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని చెప్పారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములే సరిహద్దులుగా ఉండటంతో కంచె ఏర్పాటు చేయలేదని వివరించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవన్నారు. పని త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి పనులు చేపట్టామన్నారు. పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని ఆయన వివరించారు. నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని ఆర్డీవో స్పష్టం చేశారు.

చీకటి జీవోల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే..

గీతం వర్సిటీ వద్దకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం ఛైర్మన్‌ భరత్‌ను కలిసేందుకు వెళ్తున్నామని.. తమను వెళ్లనివ్వాలని కోరాడ రాజాబాబు తదితరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. నేతలు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో కంచె వేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఈ తరహాలో పోలీసు ఆంక్షలు గతంలో ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి జీవోలు తీసుకొచ్చి వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు