Andhra News: మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం

Updated : 11 Mar 2022 17:49 IST

నంద్యాల (నేర విభాగం): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా.. వారిలో కొంత మంది వెంటనే వాంతులు చేసుకున్నారు. స్థానికులు, తల్లిదండ్రులు గుర్తించి విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందించారని తెలిపారు. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పాడైన గుడ్లు వడ్డించడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వెల్లడించారు.

చికిత్స అందిస్తున్నాం: సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌

‘‘వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్న భోజనంలో సాంబారు, గుడ్డు తిన్నామన్నారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్యం అందించాం. చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్చార్జ్‌ చేస్తాం’’ అని సూపరింటెండెంట్‌ తెలిపారు.

కారణాలు తెలుసుకోవాలి: మంత్రి సురేశ్‌

నంద్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరా తీశారు. మంత్రి సురేష్ డీఈవోతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలుసుకోవాలని, ఆహార పదార్థాలు పరీక్షించాలని మంత్రి ఆదేశించారు. పిల్లలందరికి పరీక్షలు చేసి అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లేవరకూ విద్యాశాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని