అటువంటి పట్టణాలు మరిన్ని రావాలి: మహీంద్రా

చిన్నపట్టణాలు, నగరాలు వృద్ధి చెందితేనే విస్తృతస్థాయిలో సంపద, ఉద్యోగావకాశాల పంపిణీ జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. తాజాగా భారత్‌లో జనాభా ఆధారంగా వేగంగా వృద్ధి...

Published : 09 Jan 2020 21:09 IST

ముంబయి: చిన్నపట్టణాలు, నగరాలు వృద్ది చెందితేనే విస్తృతస్థాయిలో సంపద, ఉద్యోగావకాశాల పంపిణీ జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. తాజాగా భారత్‌లో జనాభా ఆధారంగా వేగంగా వృద్ది చెందుతున్న నగరాల్లో కేరళలోని నాలుగు నగరాలు చోటు సంపాదించుకోవడంపై స్పందిస్తూ ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పెద్ద నగరాలైన ముంబయి, దిల్లీ, కోల్‌కతాలు వేగంగా వద్ధి చెందుతున్న నగరాల జాబితాలో లేకపోవడం ఎంతో శుభపరిణామం. చిన్నపట్టణాలు, నగరాలు వృద్ధి చెందితే విస్తృతస్థాయిలో సంపద, ఉద్యోగావకాశాలు పంపిణీ జరుగుతుందనడానికి ఈ ర్యాంకులే నిదర్శనం. అభివృద్ధి సాధించడానికి మనకు ఇటువంటి చిన్న పట్టణాలు మరిన్ని అవసరం’’ అని అన్నారు.

దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరులను తోసిరాజని కేరళలోని నాలుగు చిన్న నగరాలైన మలప్పురం, కోళికోడ్, కొల్లామ్‌, త్రిస్సూర్‌లు జనాభా ఆధారంగా వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరుసలో నిలిచాయి. ఐరాస గణాంకాల ఆధారంగా, ది ఎకనామిస్ట్‌ మ్యాగజైన్‌ ప్రపంచంలోనే వేగంగా జనాభా వృద్ధి చెందుతున్న చిన్న నగరాల జాబితాను రూపొందించింది. దాని ఆధారంగా చిన్న నగరాలు, పట్టణాలకు ర్యాంకులను ప్రకటించింది. దాని ప్రకారం కేరళలోని మలప్పురం 2015-2020 మధ్య కాలంలో 44.1 శాతం జనాభా వృద్ధి సాధించి జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొంది. 36.7 శాతం జనాభా వృద్ధితో వియత్నాంలోని ధో నగరం రెండో స్థానంలో ఉంది. చైనాలోని సుక్వియన్ నగరం 36.6 శాతం జనాభా పెరుగుదలతో మూడో స్థానాన్ని సొంతం చేసుకొంది.

ఇక కేరళలోని కోళికోడ్ (34.5 శాతం), కొల్లామ్‌ (31.1 శాతం) నగరాలు నాలుగు, పది ర్యాంకులతో తొలి పది స్థానాల్లో చోటు సంపాదించుకోవడం విశేషం. మరో నగరం త్రిస్సూర్‌ 30.2 జనాభా వృద్ధితో 13వ స్థానంలో నిలిచింది. అయితే గత దశాబ్ద కాలంగా రాష్ట్రాల వారిగా పెరిగిన జనాభా వృద్ధిలో కేరళ 4.6 శాతంతో వెనుకంజలో ఉండగా, 28.6 శాతంతో బిహార్‌ ముందంజలో ఉంది. అధిక సంఖ్యలో ప్రజలు ఈ నగరాలకు వలస రావడమే ఇక్కడ జనాభా వృద్ధికి ముఖ్య కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ర్యాంకులతో ఈ నగరాలు వలసలకు అనుకూలమైనవిగా గుర్తింపుపొందాయని వెల్లడించారు. అంతే కాకుండా గుజరాత్‌లోని సూరత్, తమిళనాడులోని తిరుప్పూర్‌ నగరాలు కూడా 26, 30 ర్యాంకులతో ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని