లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీజీపీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు ...

Updated : 24 Dec 2022 15:15 IST

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో సీఎస్‌, డీజీపీ మీడియాతో మాట్లాడారు. కరోనా తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నామని డీజీపీ అన్నారు. 

‘నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేసిన నగరాల్లో కరోనా నియంత్రణలో ఉంది. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావొద్దు. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రి 7 వరకు కిరాణా, కూరగాయల దుకాణాలు, పెట్రోల్‌ బంకులకు అనుమతి ఉంటుంది. రోడ్లపై తిరిగేందుకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలపై దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించం. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి’ అని డీజీపీ హెచ్చరించారు.

తెలంగాణకు వచ్చే అన్ని వాహనాలను నిలిపివేశామని.. అలాగే  తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకూ అనుమతి లేదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎక్కడా ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూడదని సూచించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం కూడా  పలు ప్రాంతాల్లో వాహనాలు రహదారులపై కనిపిస్తున్నాయని.. అలాంటి వాటిపై చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలన్నీ మూసివేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఎవరినీ రోడ్లపైకి అనుమతించమని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని