మా బిడ్డకు ఆ పోలీస్‌ అధికారి పేరు పెట్టుకున్నాం!

నాకు తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ దేవుడి పేరే మొహమ్మద్‌ రణ్‌విజయ్‌ ఖాన్ అని పెట్టుకున్నాము.

Updated : 29 Mar 2020 04:02 IST

బరేలీ: కరోనా వైరస్‌ నిరోధానికి దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో... అత్యవసర పరిస్థితిలో ఉన్న భార్యా బిడ్డలను చేరుకోవటానికి సహాయం చేసిన ఓ పోలీసు అధికారి పేరునే తమ బిడ్డకు పెట్టుకున్నారు ఆ దంపతులు. మానవత్వం, కృతజ్ఞత వంటి ఉత్తమ గుణాలకు కుల, మత భేదాలేవీ అడ్డురావని నిరూపించే ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

తమన్నా ఖాన్‌ అనే మహిళ బరేలీలో నివసిస్తున్నారు. కాగా ఆమె భర్త అనీజ్‌ ఖాన్‌ లాక్‌డౌన్‌ కారణంగా నొయిడాలో ఉండిపోవాల్సి వచ్చింది. నెలలు నిండి ప్రసవానికి సమయం దగ్గరపడటంతో ఆ మహిళ... తన అసహాయ స్థితిని వివరిస్తూ బరేలీ పోలీసు ఉన్నతాధికారులకు వీడియో మెసేజ్‌ను పంపారు. ఇందుకు స్పందించిన అధికారులు నొయిడా ఏడీసీపీ రణ్‌విజయ్‌ సింగ్‌ను సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి అనీజ్‌ ఖాన్‌ బరేలీ చేరుకునేందుకు ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనితో ఆ వ్యక్తి తన భార్యను సరైన సమయంలో చేరుకోగలిగారు. 

‘‘నిజానికి సోషల్‌ మీడియా ద్వారా వీడియో మెసేజ్‌ పంపేటప్పుడు నాకు సహాయం లభిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. కానీ నా పాలిట పోలీసులు రియల్‌ హీరోలుగా నిలిచారు. అమితమైన బాధ్యతలు, ఒత్తిడులు ఉన్నా రణ్‌విజయ్‌ సార్‌ మా జీవితాలకు అమిత విలువనిచ్చారు. నా భర్తను స్వయంగా కలిసి, ఆపద సమయంలో నన్ను చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. అందుకే నాకు తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ మానవతావాది పేరే మహమ్మద్‌ రణ్‌విజయ్‌ ఖాన్ అని పెట్టుకున్నాము.’’ అని తమన్నా కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని