జాగ్రత్త:భారత్‌లో సమూహ వ్యాప్తి ముప్పు?

భారత్‌లో కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలిస్తే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ మూడో దశలో ఉందని భావిస్తున్నారని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ....

Updated : 15 May 2020 16:35 IST

ముంబయి: భారత్‌లో కరోనా వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలిస్తే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ మూడో దశలో ఉందని భావిస్తున్నారని భారత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌, డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డి అంటున్నారు. హార్వర్డ్‌, సిడ్నీ మెడికల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ మరికొన్ని చోట్ల ఆయన పనిచేశారు.

కేసులను గమనిస్తే ప్రయాణాలకు సంబంధంలేనివి కనిపిస్తున్నాయని శ్రీనాథరెడ్డి అన్నారు. ప్రభుత్వాలు చాలావరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిపైనే దృష్టిపెట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉందంటున్న వారు స్థానిక వ్యాప్తిని గుర్తించగలుగుతున్నామని చెబుతున్నారన్నారు. అందుకే సమూహ వ్యాప్తి అనే పదం ఉపయోగించడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలంపై చర్చించాల్సిన అవసరం ఉందనీ ఆయన పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ భారత్‌కు సమూహవ్యాప్తి ముప్పు పొంచిఉందని ఆయన హెచ్చరించారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌, మలేసియా సహా నైరుతి ఆసియా దేశాలు కొవిడ్‌-19 మరణాల రేటును తగ్గించగలిగాయని శ్రీనాథ్‌ పేర్కొన్నారు. ఎక్కువ యువత, గ్రామీణ జనాభా, ఉష్ణోగ్రత, వాతావరణం, వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్‌డౌన్‌ వంటి చర్యలతో తక్కువ మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. సంబంధిత చర్యల ప్రయోజనం కనిపించిందని ఆయన పేర్కొన్నారు. వీటి నుంచి ఇంకా ఫలాలు పొందాల్సి ఉందన్నారు. ఆంక్షలు సడలించినా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం, మాస్క్‌లు, చేతులు శుభ్రం చేసుకోవడం కొనసాగించాలని సూచించారు.

జన సమూహ ప్రదేశాలు, మురికివాడలు, తాత్కాలిక నివాస కేంద్రాల వద్ద కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనాథరెడ్డి అన్నారు. అదృష్టవశాత్తూ పెద్ద నగరాల్లోనే వైరస్‌ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు. వలస కార్మికులు వైరస్‌ బాధితులు కాకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువ మంది జీవిస్తున్న గ్రామీణ భారతాన్ని రక్షించుకోవాలని సూచించారు. వైరస్‌ కొంతకాలం వరకు ఉంటుందని గుర్తించి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు భౌతిక దూరం పాటించినప్పుడే వైరస్‌ తీవ్రత తగ్గుతుందని చరిత్ర చెబుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని