రోగ నిరోధక శక్తి తగ్గుదల లక్షణాలివే!

కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్‌ రాకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం.

Updated : 22 May 2020 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్‌(టీకా) రాకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. భౌతిక దూరం, పరిశుభ్రతే కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు మన ముందున్న మార్గాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మనిషి వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్‌) కరోనా వైరస్‌ నుంచి ముప్పును తగ్గించి మనిషి ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారిందని వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మానవశరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుదల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా?

తరచూ జలుబు చేయడం
మనకు తెలియకుండానే మనలో రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ వస్తుంది. అయితే కొందరిలో ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా జబ్బు పడతారు. సాధారణంగా మానవుడు సంవత్సర కాలంలో మూడు సార్లు జలుబు బారిన పడే అవకాశం ఉందని చెబుతుంటారు. కానీ అంతకంటే ఎక్కువ సార్లు జలుబు చేయడం.. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే.. అతనిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు భావించాలి. ఒక్కోసారి  ఇమ్యూనిటీ పవర్‌ తక్కువగా ఉంటే కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం కూడా కుదరదు.

జీర్ణవ్యవస్థ గాడి తప్పడం
మనిషి ఆరోగ్యంగా ఉండడంలో జీర్ణ వ్యవస్థ కీలకమైంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరానికి కావాల్సిన పోషకాలు, శక్తి, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. జీర్ణక్రియ ఏ మాత్రం గాడి తప్పినా.. శరీరానికి బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ ‌అయ్యినట్టే. జీర్ణక్రియ సరిగ్గా పని చేయకపోవడం అనేది మీలో వ్యాధి నిరోధక శక్తి అల్పంగా ఉందనడానికి నిదర్శనం. తీసుకున్న ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాకపోవడం వల్ల శరీరం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు పాటించాలి.

ఎక్కువ అలసట..
కొందరు ఎంత పని చేసినా ఉత్సాహంగా, తాజాగా కనిపిస్తారు. మరికొందరు అదే పనికి ఎక్కువగా అలసట పడకున్నా.. చెమటోడ్చి పూర్తి చేస్తారు. ఇక మూడోరకం వారు చేసిన చిన్నపాటి పనికే అలసిపోతుంటారు. ఇలా తక్కువ పనికే అధికంగా అలసట బారిన పడటం శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ అల్పంగా ఉందని తెలియజేస్తుంది. క్రమం తప్పకుండా ఉదయపు నడక (మార్నింగ్ వాక్)‌, పరుగెత్తడం వల్ల శరీరాన్ని అలసట బారిన పడకుండా కాపాడుకోవచ్చు.  వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది.

గాయాలు త్వరగా మానకపోవడం
ఆరోగ్యవంతుల్లో గాయాలు త్వరగా మానడం గమనించే ఉంటాం. అంటే వారిలో వ్యాధి నిరోధక శక్తి మెండుగా ఉందని అర్థం. అదే సమయంలో కొందరు చిన్న గాయం తగిలినా దాని నుంచి కోలుకునేందుకు కొన్ని నెలలు సమయం పడుతుంది. ఒక్కోసారి ఆ గాయాలు పూర్తిగా మానక దీర్ఘకాలం బాధిస్తుంటాయి. అంటే వారి శరీరానికి గాయాలను మాన్పే శక్తి లేదన్నమాట. ఫలితంగా గాయాలు త్వరగా మానక శరీరం అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. ఈ సంకేతాలతో వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని గ్రహించవచ్చు.

అధిక ఒత్తిడికి లోనవ్వడం
చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు చాలా ఒత్తిడికి లోనవుతుంటారు.  మరికొందరు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిని చక్కబెడతారు. ఇలా వ్యవహరించే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాకాకుండా చిన్న విషయాలు, పనికి ఎక్కువగా ఒత్తిడికి లోనైతే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఓ అంచనాకు రావొచ్చు. వీటితో పాటు అధిక బరువు, శరీరానికి ఎండ తగలకపోవడం వంటివి రోగ నిరోధక శక్తిని క్షీణించేలా చేస్తాయి. ఇలా మీలో రోగనిరోధక శక్తి ఎలా ఉందో ఎలాంటి పరీక్షలు లేకుండానే తెలిసిపోతుంది. అందువల్ల కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి, నిమ్మ జాతి పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో త్వరగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని