ఇక వాట్సాప్‌లో కోర్టు నోటీసులు

ఇక మీదట కోర్టు సమన్లు, నోటీసులను వాట్సాప్‌తోపాటు ఈ-మెయిల్, ఫాక్స్ ద్వారా కూడా అందజేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది...

Published : 10 Jul 2020 23:56 IST

దిల్లీ: ఇక మీదట కోర్టు సమన్లు, నోటీసులను వాట్సాప్‌తోపాటు ఈ-మెయిల్, ఫాక్స్ ద్వారా కూడా అందజేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘నోటీసులు, సమన్లు, వాదనలకు సంబంధించిన ప్రతులు పంపేందుకు పోస్టాఫీసులకు వెళ్లడం సాధ్యం కాదని మా దృష్టికి వచ్చింది. ఇక మీదట అటువంటి సేవలను అందజేసేందుకు ఈ-మెయిల్, ఫాక్స్, వాట్సాప్‌, టెలిఫోన్‌ మెస్సెజింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు’’ అని కోర్టు వెల్లడించింది. నోటీసును అందిన వ్యక్తి దాన్ని చూసినట్టు రెండు నీలి రంగు టిక్‌ మార్క్‌లు వాట్సాప్‌ ద్వారా తెలుస్తుందని నోటీసులు జారీ చేయడం గురించి జస్టిస్‌ ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కరోనా వైరస్ కారణంగా హైకోర్టులు, ట్రెబ్యునల్స్‌లో అప్పీలు దాఖలు చేసే పరిమితి పొడిగింపుపై విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మే నెల నుంచి పిటిషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికతను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. అలానే కేసుల విచారణ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని