AP News: దూరం తగ్గి... వేగం పెరిగేలా!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణం కానుంది.

Published : 19 Jul 2021 14:33 IST

ఖమ్మం, విజయవాడల మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే
రహదారి మొత్తం పొడవు 90 కి.మీ.

ఈనాడు, అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణం కానుంది. దీన్ని గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా పిలుస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకునేందుకు ఈమార్గం అనువుగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తెలంగాణలో ఖమ్మం జిల్లాల్లో భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఖమ్మంలో కొంతమేరకు పూర్తయింది. ఇప్పటికే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుగా చేపట్టారు.

రహదారి ఇలా..

తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రాలోని విజయవాడ నగరాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వర్తక, వాణిజ్య పరంగానే కాకుండా వృత్తులు, బంధుత్వాల పరంగా అనుబంధం ఉంటుంది. ప్రస్తుతం జాతీయ రహదారి మార్గం విజయవాడ నుంచి కోదాడ వరకు, అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ఖమ్మం వరకు మొత్తం 130 కి.మీ. పొడవున ఉంది. మరోమార్గం చిల్లకల్లు నుంచి వత్సవాయి మీదుగా బోనకల్లు వరకు 120 కి.మీ. ఉంది. రైలు మార్గం 102 కి.మీ. మాత్రమే. ఈ రైలుమార్గానికి సమాంతరంగా మరో రోడ్డు మార్గం నిర్మించాలనే ప్రతిపాదన 2018లో వచ్చింది. 2018, 2019లలో నివేదికను రూపొందించారు. ఈమార్గం పూర్తయితే ముప్పై కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశముంది. ప్రస్తుత గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి 90 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో కృష్ణాలో 30 కి.మీ., ఖమ్మంలో 60 కి.మీ. ఉంటుంది. రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.4,600 కోట్లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు అమలు యూనిట్‌(పీఐయూ)ను ఖమ్మంలో ఏర్పాటు చేశారు.

భూసేకరణకు సన్నద్ధం

ఖమ్మం నుంచి బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, మీదుగా చెరువుమాధవరం, జి.కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుకుంటుంది. అక్కడ సక్కంపూడి సమీపంలో విజయవాడ బైపాస్‌ రహదారికి అనుసంధానిస్తారు. కృష్ణా జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణం మండలాలోని గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది. ఈ మూడు మండలాల తహశీల్దార్లకు సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత ఇటీవల లేఖ రాశారు. కృష్ణా జిల్లాలో మొత్తం 1,65,647.554 చదరపు మీటర్ల భూమి అవసరమని గుర్తించారు. జి.కొండూరు మండలంలో దుగ్గిరాలపాడు, పెట్రేంపాడు, గంగినేనిపాలెం, సున్నంపాడు, తెల్లదేవరపాడు, మునగపాడు, గడ్డమణుగు, కవులూరు, కొండూరు గ్రామాల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. విజయవాడ గ్రామీణ మండలం పరిధిలో రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి గ్రామాల్లో భూసేకరణ అవసరం ఉంటుంది. గంపలగూడెం మండలంలో తునికిపాడు పరిధిలో మాత్రమే చేయాల్సి ఉంది. ఆయా మండలాల తహశీల్దార్లు గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకు ఏగ్రామంలో ఎంత విస్తీర్ణంలో భూమి తీసుకోవాల్సి ఉందో పేర్కొంటూ సర్వే నంబర్లు, భూమి రకం, భూమి సహజత్వం, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఖమ్మం ప్రాజెక్టు యూనిట్‌ పీడీ దుర్గాప్రసాద్, కృష్ణా కలెక్టర్‌ జె.నివాస్, సంయుక్త కలెక్టర్‌ మాధవీలతను కలిసి భూసేకరణపై సమీక్షించారు. ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, బోనకల్లులో అలైన్‌మెంట్‌ రూపొందించి భూసమీకరణ జరుగుతోంది.

ప్రాజెక్టు: గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే
ఎక్కడి నుంచి: ఖమ్మం నుంచి విజయవాడకు
దూరం: 90 కిలోమీటర్లు, ఆరు వరసలు
అనుసంధానం: తెలంగాణతో...
అంచనా వ్యయం: రూ.4,600 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: భూసేకరణ దశ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని