ఆ గట్టున అనుమతి.. ఈ గట్టున తవ్వకం!

గోదావరి వరదలతో తీరంలోని సుమారు 20 ఎకరాల వరకు భూములు నదిలో కలిసిపోయాయి. ఈ భూములే అక్రమార్కులకు వరంగా మారాయి.

Updated : 25 Mar 2023 04:59 IST

పెదమల్లం లంక నుంచి అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు

కోనసీమ మీదుగా రవాణా

తీరంలో ఇసుక తవ్వకాలు (అంతర్‌ చిత్రంలో) బాటలు ఏర్పాటు చేసి టిప్పర్లతో రవాణా

పెనుగొండ, ఆచంట, న్యూస్‌టుడే

గోదావరి వరదలతో తీరంలోని సుమారు 20 ఎకరాల వరకు భూములు నదిలో కలిసిపోయాయి. ఈ భూములే అక్రమార్కులకు వరంగా మారాయి. వీటిల్లో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించుకునేందుకు అనుమతి కావాలంటూ రైతుల పేరున పలువురు మట్టి వ్యాపారులు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధికారులకు దరఖాస్తు చేసి అనుమతులు పొందారు. మరి కొందరు జాతీయ రహదారి, జగనన్న కాలనీలకు మట్టి రవాణా పేరున అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. వీటిని అడ్డు పెట్టుకుని పశ్చిమ పరిధిలోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుక తవ్వేస్తున్నారు. తీరం వెంబడి వాహనాలు వెళ్లే విధంగా బాటలు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు పొక్లెయిన్లతో దర్జాగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం లంక పరిధిలో రెండు చోట్ల ఈ దందా కొనసాగుతోంది. రోజుకు సుమారు 100 నుంచి 200 పైగా ట్రిప్పర్లతో కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇసుక, మట్టి తరలిస్తున్నారు.

రైతుల గగ్గోలు...

తవ్వకాలు జరుపుతున్న నదీ తీరానికి ఆనుకుని లంక సొసైటీకి సంబంధించిన సుమారు 60 ఎకరాల లంక భూములు ఉన్నాయి. ఇవన్నీ పెదమల్లంలంక, అనగారలంక, కోడేరు గ్రామాలకు చెందిన రైతుల భూములు. వీటిలో మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలు పండిస్తున్నారు. ఈ భూములకు ఆనుకుని తీరం వెంబడి సుమారు 10 మీటర్ల లోతుగా ఇసుక, మట్టిని తవ్వుతుండటంతో భవిష్యత్తులో కోత బారినపడే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై ఇప్పటికే ఆచంట రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.


ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు(పాత చిత్రం)

గోదావరి తీరం, లంక భూములు అక్రమార్కులకు అడ్డాగా మారిపోయాయి. అనుమతులతో పనిలేకుండా పలుకుబడి, పరపతి పెట్టుబడిగా అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేస్తూ లంకలను గుల్ల చేస్తున్నారు. తాజాగా ఆచంట మండలం పెదమల్లం పంచాయతీ పరిధిలోని పెదమల్లంలంకలో సుమారు 15 రోజుల నుంచి భారీ ఎత్తున మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టారు. పట్టా భూముల్లో బొండు మట్టి తొలగించే నెపంతో అనుమతి పొంది గోదావరి తీరంలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు లంక రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలతో సమీప లంక భూములు కోతకు గురై గోదావరిలో కలిసిపోయే ప్రమాదం ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం రెండు జిల్లాలకు సరిహద్దులో ఉండటంతో పరిధి తమది కాదంటే తమది కాదంటూ రెండు జిల్లాల అధికారులు దాటవేత ధోరణి అవలంభించడం అక్రమార్కులకు దన్నుగా మారింది.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

సమస్యను లంక గ్రామాల రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలనకు ఆర్‌ఐ, వీఆర్వోలను కూడా పంపించాం. పశ్చిమగోదావరి పరిధిగా తేలితే తక్షణం చర్యలు తీసుకుంటాం.

ఆర్‌.రాజ్యలక్ష్మి, ఇన్‌ఛార్జి తహసీల్దారు, ఆచంట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని