Hyderabad: పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి డ్రోన్‌ సర్వే

పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్‌, ప్రభావిత ఆస్తులు తదితరాలపై డ్రోన్‌ సర్వేని హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ప్రారంభించింది.

Updated : 28 Aug 2023 07:58 IST

దారుల్‌షిఫా - శాలిబండ కూడలి మధ్య  రహదారి విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్‌, ప్రభావిత ఆస్తులు తదితరాలపై డ్రోన్‌ సర్వేని హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ప్రారంభించింది. దారుల్‌షిఫా కూడలి నుంచి శాలిబండ కూడలి మధ్య ఇరుకైన మార్గం విస్తరణ, మెట్రోస్టేషన్ల నిర్మాణానికి రహదారిని విస్తరించాల్సి ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో చేసే సర్వేతో పాటు రహదారి విస్తరణకు అవసరమైన ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి డ్రోన్‌ సర్వే కూడా ప్రారంభించామని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

  • మెట్రోరైలు మొదటి దశ కారిడార్‌-2లోని ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. పాతబస్తీ మార్గాన్ని అలైన్‌మెంట్‌ వివాదాలతో చేపట్టలేదు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పాతబస్తీలో మెట్రో రైలు సన్నాహక పనులను వేగవంతం చేసినట్లు అధికారులు చెప్పారు.

వందకుపైగా మతపరమైన కట్టడాలు

తక్కువ దూరమే అయినా పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌ మార్గంలో 21 మసీదులు, 12 ఆలయాలు, 12 అషూర్‌ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలతో సహా దాదాపు 103 మతపరమైన, ఇతర సున్నిత నిర్మాణాలు మెట్రో నిర్మాణానికి సవాల్‌గా ఉన్నాయి. అలైన్‌మెంట్‌, స్తంభాలు నిర్మించే ప్రదేశాలు మొదలైన వాటిని మతపరమైన, సున్నిత నిర్మాణాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని విధంగా.. డ్రోన్‌ సర్వే ఆధారంగా ప్రణాళిక చేస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ  ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రియల్‌ టైమ్‌ డేటా, హై రిజల్యూషన్‌ చిత్రాలు, 3డి మోడలింగ్‌, జీఐఎస్‌ డేటా, క్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ తోడ్పాటుతో త్వరితగతిన విశ్లేషణ చేయవచ్చన్నారు.

ఫలక్‌నుమా నుంచి భూసామర్థ్య పరీక్షలు  

మెట్రో స్తంభాల పునాదులు నిర్మించే చోట భూసామర్థ్య పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల టెండర్లను కొద్దిరోజుల్లో ఖరారు చేయనున్నట్లు మెట్రో రైలు ఎండీ తెలిపారు. చివరి స్టేషన్‌ ఫలక్‌నుమా నుంచే మట్టి పరీక్షలు ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌నుమా నాలుగు స్టేషన్లు రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు