Covid-19: కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హరీశ్‌రావు

దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహించకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం

Updated : 05 Jun 2022 06:29 IST

హైదరాబాద్: దేశ, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహించకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమెరికా, ఉత్తర కొరియా, జర్మనీలో నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయని.. మనదేశంలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయని.. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివీటీ రేటు పెద్దగా లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ వైద్యారోగ్య శాఖ సిబ్బంది అలసత్వంతో ఉండరాదు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది.  ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. గుంపులు, గుంపులుగా తిరగొద్దు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకొని అవసరమైన ఔషధాలు తీసుకోవాలి. కరోనా పరీక్షలు, చికిత్స, వాక్సినేషన్ పక్కాగా జరిగేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పని చేయాలి. ఇప్పటివరకు కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది చాలా బాగా పని చేశారు. అదే స్ఫూర్తితో ఈ సారి కూడా అప్రమత్రంగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడుదాం’’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని