Munugode Bypoll: మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించట్లేదు: హైకోర్టు

మునుగోడులో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

Published : 14 Oct 2022 15:23 IST

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘2018 అక్టోబరు 12న మునుగోడులో 2,14,847 ఓటర్లు ఉన్నారు. ఈనెల 11వ తేదీ నాటికి మునుగోడు ఓటర్ల సంఖ్య 2,38,759కి చేరింది. 25,013 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 12,249 కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పించి.. మిగతా 7,247 తిరస్కరించాం. మరో 5,517 ఫారం-6లు పెండింగులో ఉన్నాయి. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుంది’’ అని రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదికలో పేర్కొన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం.. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలివ్వాలన్న అంశంపై ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. సవరించిన ఓటరు జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని