TS High Court: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు సబబే: హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది.

Updated : 27 Sep 2023 14:23 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టారు. ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

మీ నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా?

అప్పీల్‌పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. టీఎస్‌పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా’’ అని టీఎస్‌పీఎస్సీని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని