Omicron Wave: థర్డ్‌వేవ్‌ వేళ.. ఆస్పత్రి చేరికలు పెరుగుతున్నాయ్‌..!

థర్డ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చేరికలు 5 నుంచి 10శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 11 Jan 2022 01:36 IST

రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇలా థర్డ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కొవిడ్‌ బాధితుల ఆస్పత్రి చేరికలు 5 నుంచి 10శాతం ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ విజృంభణ క్రియాశీలంగానే ఉన్నందున.. రానున్న రోజుల్లో ఆస్పత్రి చేరికలు వేగంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన ఆస్పత్రి పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇక సెకండ్‌ వేవ్‌ సమయంలో కొవిడ్‌ బాధితులు ఆస్పత్రిలో చేరికలు 20 నుంచి 30శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

పది రోజుల క్రితం దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 10 నుంచి 15వేలు మాత్రమే ఉన్నాయి. కానీ, నిన్న ఒక్కరోజే లక్షా 79వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ‘దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా పెరగడం కనిపిస్తోంది. ఆందోళనకర ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాబల్యంతోనే ఈ పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌ ఉద్ధృతి కూడా కొనసాగుతూనే ఉంది. క్రియాశీల కేసుల్లో 5 నుంచి 10శాతం బాధితులకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో మార్పులు వేగంగా జరగవచ్చు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌ సదుపాయాలపై నిత్యం పర్యవేక్షించాలి. అవసరమైన సమయాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ పడకలను అందుబాటులోకి తేవాలి’ అని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. వీటితోపాటు జూనియర్‌ డాక్టర్లు, ఎంబీబీఎస్‌ విద్యార్థులతోపాటు నర్సింగ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

ఇక మునుపటి వేవ్‌ల మాదిరిగానే మెట్రో నగరాల్లో కొవిడ్‌ విజృంభణ ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ముంబయి, దిల్లీ నగరాల్లో నిత్యం 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అటు చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లోనే వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా నాలుగు వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 4,033 మంది కొత్త వేరియంట్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,216 ఒమిక్రాన్‌ కేసులు రాగా.. రాజస్థాన్‌లో 529, దిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని