
Ts News: కొవిడ్ ఎఫెక్ట్.. హాస్టళ్లు ఖాళీ చేయాలని విద్యార్థులకు హెచ్సీయూ విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) కోరింది. తరగతులు, పరీక్షలు అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు హెచ్సీయూ వెల్లడించింది. కొవిడ్ బాధితులని ఐసోలేట్ చేసేందుకు వర్సిటీలో వసతులు చాలా పరిమితంగా ఉన్నాయని యూనివర్సిటీ ఉపకులపతి బీజే రావు తెలిపారు. మరోవైపు కేసులు పెరుగుతున్నందున యూనివర్సిటీ వైద్య యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు గతంలో మాదిరిగా ఆన్లైన్లో జరపాలని యూనివర్సిటీ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసిందని వీసీ వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులు, సిబ్బంది యూనివర్సిటీ ఫార్మసీలో అందుబాటులో ఉన్న కిట్ల ద్వారా లేదా బయట కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు క్యాంపస్ విడిచి స్వస్థలాలకు వెళ్లిపోవడమే మంచిదని వీసీ అభిప్రాయపడ్డారు.