IIT madras: ఐఐటీ మద్రాస్‌లో ఏపీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో రెండో ఘటన!

మద్రాస్‌ ఐఐటీలో నెల రోజుల వ్యవధిలోనే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి చెందిన పుష్పక్‌ శ్రీ సాయి అనే బీటెక్‌ మూడో సంవత్సరం బలవన్మరణం చెందాడు.

Published : 14 Mar 2023 23:36 IST

చెన్నై: తమిళనాడు(tamilnadu)లోని ప్రతిష్టాత్మక మద్రాస్‌ ఐఐటీ(IIT madras)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఏపీకి చెందిన పుష్పక్‌ శ్రీ సాయి (20) అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణం చెందినట్టు పోలీసులు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో ఈ విద్యా సంస్థలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలకం రేపుతోంది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నసాయి తన గదిలోనే ఉరివేసుకొని కనిపించినట్టు పోలీసులు తెలిపారు. అకాడమిక్‌ సంబంధిత సమస్యల వల్లే అతడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు. అయితే, విద్యార్థి స్వస్థలం ఏపీలో ఎక్కడ అనే సమాచారం తెలియరాలేదు. తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, పోస్టుమార్టం తర్వాతే మిగతా వివరాలు చెప్పగలమని చెప్పారు.  ఫిబ్రవరి 14న ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్ పీజీ విద్యార్థి హాస్టల్‌ గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనపై ఐఐటీ మద్రాస్‌ స్పందించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మూడో సంవత్సరం బీటెక్‌ విద్యార్థి అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొంది. కరోనా తర్వాత వాతావరణం సవాల్‌తో కూడుకున్నదిగా మారిందని, తమ క్యాంపస్‌లో విద్యార్థులు/ అధ్యాపకులు, సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులతో పాటు విద్యాసంస్థ అంతర్గత కమిటీ ఇలాంటి వ్యవహారాలను పరిశీలిస్తుందని పేర్కొంది. విద్యార్థి తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ దుఃఖ సమయంలో తమ సంస్థ తరఫున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని